టపాసుల వద్దు.. ప్రకృతి ముద్దు..

Odisha Banned The Use Of Firecrackers Over corona Pandemic - Sakshi

భువనేశ్వర్‌: కొవిడ్‌-19 రోగుల క్షేమం కోసం పర్యావరణహితమైన టపాకాయల అమ్మకాన్ని, వాడకాన్ని ఒడిశా ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నవంబర్‌ 10 నుంచి 30 వరకు నిషేధం ఉంటుంది. దీపావళి, కార్తీక పూర్ణిమ ఈ నెల 14, 30న ఉండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నవంబర్‌ 10 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా టపాకాయల అమ్మకం, వాడకం నిషేధించాలని ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌ త్రిపాఠి  ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారెవరికైనా విపత్తు నిర్వహణ చట్టం 2005, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం శిక్షకు గురవుతారని ఉత్తర్వులో పేర్కొందనన్నారు. 

కొవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల మధ్య క్రాకర్లను కాల్చడం, సీతాకాలం సమీపించడంతో.. ఒడిశా ప్రభుత్వం నవంబర్ 10 నుండి 30 వరకు ప్రజా ప్రయోజనాల కోసం టపాకాయల అమ్మకం, వాడకాన్ని నిషేధిస్తుందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఒడిశాలో కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి గణనీయమైన స్థాయిలో నియంత్రించబడిందని పేర్కొన్న ఈ ఉత్తర్వు, ప్రస్తుత పరిస్థితిని నియంత్రించడంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

త్రిపాఠి మాట్లాడుతూ... కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గినప్పటికీ ప్రమాదం ఇంకా ఉందని, వైరస్‌ కొన్ని దేశాలలో తిరిగి విజృంభించిందని, కొవిడ్‌-19 పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. సీతాకాలంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందుతుందని వైరస్‌ ప్రభావం ఎక్కువవుతుందని ఏకే త్రిపాఠి అభిప్రాయపడ్డారు. శీతాకాలంలో ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కొవిడ్‌-19 పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. టపాకాయలు కాల్చడం వల్ల  నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై యాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన రసాయనాలు అధిక మొత్తంలో విడుదల అవుతాయి. ఈ రసాయనాలు శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక అధికారులు, పోలీసులు ఈ నిషేధ అమలుకు చర్యలు తీసుకోవాలని ఏకే త్రిపాఠి ఆదేశించారు. రెండు రోజుల క్రితం రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా కొవిడ్‌-19 బాధితుల క్షేమం కోసం పర్యావరణహితమైన టపాకాయలను వాడకుండా నిషేధించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top