కరోనా: మాత్రలు వద్దు.. పౌష్టికాహారమే ముద్దు

Nutrition Food Better For CoronA Cure - Sakshi

విటమిన్‌ మాత్రలకు డిమాండ్‌

వృద్ధులు, రోగులకే మందులు అవసరం

పండ్లు, కూరగాయల్లో పుష్కలంగా  విటమిన్లు

కరోనా భయంతో విటమిన్‌–సి, డి వినియోగం 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సోకకుండా విటమిన్‌ ట్యాబ్లెట్లు వాడితే ప్రయోజనమంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపించగానే మెజార్టీ ప్రజలు అందులో నిజమెంతని నిర్ధారణ చేసుకోకుండానే వెంటనే ఆచరణలో పెట్టేస్తున్నారు. గతంలో శానిటైజర్లు, ఎన్‌ 95 మాస్క్‌ల కోసం ఎగబడిన వారు నేడు వ్యాధి నిరోధక శక్తిని పెంచే మాత్రలను ముందస్తుగానే కొంటున్నారు. దీంతో మార్కెట్లో  కొన్ని రకాల ఔషధాలకు కొరత ఏర్పడింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వివిధ రకాల సమాచారం చూసి ప్రజలు ముందస్తుగా కరోనా నియంత్రణ కోసం విటమిన్‌–సి, విటమిన్‌–డి, జింక్‌ మాత్రలను కొని ఇంట్లో భద్రం చేసుకుంటున్నారు. ఈ మందులు వాడడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనే ప్రచారం విపరీతంగా ఉండడంతో మార్కెట్‌లో ఆయా మాత్రలకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. అవసరం ఉన్నా లేకపోయినా అందరూ ఆ మాత్రలను కొని నిల్వ చేసుకుంటున్నారు.  

ప్రజల భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు... 
ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరా చేసుకుని కొన్ని మందుల కంపెనీలు, వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. విటమిన్‌–సి మాత్రలు విడివిడిగా తీసుకుంటే తక్కువ ధరకు లభిస్తాయి. డిమాండ్‌ను గుర్తించిన కొన్ని కంపెనీలు ఆ రెండు మందులతోపాటుగా బి–కాంప్లెక్స్, మరికొన్ని విటమిన్స్, మినరల్స్‌ ఉన్నాయంటూ కాంబినేషన్‌ డ్రగ్స్‌ తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో పది మాత్రల స్ట్రిప్‌ రూ.200 వరకూ ధర పలుకుతోంది. 

నెల రోజులుగా కరోనా సెకెండ్‌ వేవ్‌ కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజల్లో కరోనా పట్ల భయాందోళనలు పట్టుకున్నాయి. వైరస్‌ రాకుండా ఉండేందుకు ఎవరు ఏది చెప్పినా దాన్ని ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కషాయాలు, పసుపు, మిరియాలు కలిపిన పాలు, అల్లం సొంటి టీలు తాగుతున్నారు. ఆవిరి  పట్టుకుంటున్నారు. విటమిన్‌–సి, విటమిన్‌–డి, జింక్‌ మాత్రలను నెలకు సరిపడా కుటుంబ సభ్యులందరి కోసం బాక్సులను కొనుగోలు చేస్తున్నారు. 

విటమిన్‌ మాత్రలకు బాగా డిమాండ్‌ 
జిల్లా వ్యాప్తంగా నేడు విటమిన్‌ మాత్రలకు బాగా డిమాండ్‌ పెరిగింది. జిల్లాలో రెండు వేల రిటైల్‌ షాపులు, వెయ్యి హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులున్నాయి. గతంలో రోజూ ఐదుగురికి  మించి విటమిన్‌ మాత్రలు అడిగేవారు కారు. కొద్ది రోజులుగా 20 నుంచి 30 మంది విటమిన్‌ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు. జింక్‌ మాత్రలు ప్రస్తుతం రెండు వారాలుగా స్టాక్‌ లేవు.                 
– కె.శ్రీధర్, పార్వతీపురం  

చదవండి: 12 గంటల తర్వాత నో ఎంట్రీ.. ఏపీలో కఠిన ఆంక్షలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top