
మూడో ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించిన సిట్
బెంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళలో జరిగిన సామూహిక ఖననం కేసులో మొదటి రెండు ప్రాంతాల్లో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పుడు మూడవ ప్రదేశంలో తవ్వకాలు ప్రారంభించింది. 1995 నుంచి 2014 మధ్యకాలంలో ధర్మస్థళలో పనిచేశానని, మహిళలు, మైనర్లతో సహా అనేక మృతదేహాలను అక్కడ ఖననం చేశానని మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పడం, ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం తెలిసిందే.
కార్మికుడు తెలిపిన 15 స్థావరాల వివరాల ఆధారంగా సిట్ ఇప్పటివరకు రెండు ప్రదేశాల్లో తవ్వకాలు చేసింది. ఆ రెండు ప్రదేశాల్లోనూ ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న మొదటి ప్రదేశంలో మంగళవారం తవ్వకాలు నిర్వహించారు. జేసీబీని ఉపయోగించి లోతుగా తవ్వినప్పటికీ ఎలాంటి అవశేషాలు దొరకలేదు. రెండవ స్థలం కూడా అలాగే ఖాళీగా కనిపించింది. ప్రస్తుతం మూడో ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కార్మికుడు చెప్పిన 15 ప్రదేశాల్లో ఎనిమిది నేత్రావతి నది ఒడ్డున, నాలుగు ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై, మిగిలిన రెండు హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.
చీఫ్ మార్పు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం: హోంమంత్రి
ఈ కేసు దర్యాప్తులో సిట్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతీని మార్చే విషయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి డైరెక్టర్ జనరల్ ర్యాంకుల అధికారుల జాబితాలో మొహంతీ పేరు కూడా ఉండటంతో.. మార్పు విషయమై మీడియా మంత్రిని ప్రశ్నించింది. కేంద్రంలో ఉండి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి నేతృత్వం వహించే అవకాశం ఆయనకు ఉంటుందని, ఆయనను కొనసాగించాలా? లేదా మరొకరిని నియమించాలా? అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. చట్టం, నియమాలు అనుమతిస్తే ఆయన అక్కడే కొనసాగుతారని, లేదంటే అదే హోదా కలిగిన అధికారిని నియమిస్తామని పరమేశ్వర స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయను. దర్యాప్తు పూర్తయి నివేదిక అందిన తరువాత మాట్లాడతాను’అని హోంమంత్రి తెలిపారు.