సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు | No Freedom To Make Statements Defamatory To Indian Army | Sakshi
Sakshi News home page

సైన్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు

Jun 5 2025 5:54 AM | Updated on Jun 5 2025 5:54 AM

No Freedom To Make Statements Defamatory To Indian Army

రాహుల్‌పై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం

లక్నో: భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా కొన్ని సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుందని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. భారత సైన్యాన్ని గానీ, ఇతర వ్యక్తులను గానీ కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడే స్వేచ్ఛను భావ ప్రకటనా స్వేచ్ఛగా పరిగణించలేమని స్పష్టంచేసింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. 2022లో భారత్‌ జోడో యాత్ర సమయంలో భారత సైన్యాన్ని కించపర్చేలా రాహుల్‌ గాంధీ మాట్లాడారని ఆరోపిస్తూ బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌శంకర్‌ శ్రీవాస్తవ లక్నో కోర్టులో ఫిర్యాదు చేశారు.

 దాంతో కోర్టు రాహుల్‌ గాంధీకి సమన్లు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమన్లు కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) పౌరులకు వాక్‌ స్వాతంత్య్రపు హక్కు కల్పించినట్లు గుర్తుచేసింది. అయినప్పటికీ సైన్యాన్ని, వ్యక్తులను కించపర్చేలా మాట్లాడే హక్కుల ఎవరికీ లేదని పేర్కొంది. రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కింది కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement