సుధా భరద్వాజ్, వరవరరావు బెయిల్‌ రద్దు చేయాలి  | NIA seeks cancellation of Sudha Bharadwaj and Varavara Rao bail | Sakshi
Sakshi News home page

సుధా భరద్వాజ్, వరవరరావు బెయిల్‌ రద్దు చేయాలి 

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

NIA seeks cancellation of Sudha Bharadwaj and Varavara Rao bail

ఎల్గార్‌ పరిషత్‌ కేసు.. కోర్టులో ఎన్‌ఐఏ పిటిషన్‌ 

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితులుగా ఉన్న సుధా భరద్వాజ్, వరవరరావులకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేసింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధిక్కరిస్తూ ‘అర్బన్‌ నక్సల్‌’మావోయిస్ట్‌ ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరయ్యారని ఆరోపించింది. 

ఈ ఏడాది జనవరి 19వ తేదీన ముంబై ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ కేసులో సహనిందితులైన అరుణ్‌ పెరీరా, ఆనంద్‌ తెల్తుంబే, రొనా విల్సన్‌లు కూడా పాల్గొన్నారంది. ఈ కార్యక్రమం దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, సమగ్రతకు ప్రత్యక్షంగా ప్రమాదకరమైందని తెలిపింది. కాగా, సుధా భరద్వాజ్‌కు సాంకేతిక కారణాలతో 2021లో బెయిల్‌ మంజూరు కాగా, వరవరరావుకు ఏడాది తర్వాత అనారోగ్య కారణాలపై బెయిల్‌ మంజూరైంది. దిగువ కోర్టు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడరాదు, అనుమతి లేకుండా ముంబై విడిచి వెళ్లరాదనేవి అందులో ఉన్నాయి. 

ప్రెస్‌ క్లబ్‌ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వీరు బెయిల్‌ నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే కాకుండా నిషేధిత సంస్థల లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించారంది. ప్రజా శాంతికి, దేశ భద్రతకు ముప్పు కలిగించే సమావేశాలు, కార్యకలాపాల్లో పాల్గొనరాదన్న షరతులను వీరు అతిక్రమించారని ఎన్‌ఐఏ తెలిపింది. వీరికి న్యాయ ప్రక్రియపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం దీనివల్ల రూఢీ అవుతోందని పేర్కొంది. పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సుధా భరద్వాజ్, వరవరరావులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 22వ తేదీన చేపడతామంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement