ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్‌ ఆర్మీ పరుగులు | Neha Bhandari, Lone BSF Officer Who Commanded Border Outpost Along IB During Operation Sindoor | Sakshi
Sakshi News home page

neha bhandari: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ భారత మహిళా జవాన్ల దెబ్బకు పాక్‌ ఆర్మీ పరుగులు

May 30 2025 8:16 AM | Updated on May 30 2025 9:03 AM

neha bhandari, lone bsf officer who commanded border outpost along ib during operation sindoor

న్యూఢిల్లీ: మూడు రోజులు. రేయింబవళ్లు. రెండు పోస్టులు. ఏడుగురు మహిళా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు పాకిస్తాన్  ఆర్మీకి చుక్కలు చూపించారు. భారత మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్ల ధైర్య సాహసాలతో పాకిస్తాన్ సైన్యం జడుసుకుంది. బ్రతుకు జీవుడా అంటూ పారిపోయింది. ప్రస్తుతం మహిళా బీఎస్‌ఎఫ్ జవాన్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆపరేషన్ సిందూర్ గురించి రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక ఆపరేషన్ సిందూర్‌లో క్రితం బీఎస్‌ఎఫ్‌లో చేరిన అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో ఆరుగురు మహిళా బీఎస్‌ఎఫ్ జవానులు జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) అఖ్నూర్ సెక్టార్ వద్ద పాక్ దళాలపై నేరుగా కాల్పుల్లో పాల్గొన్నారు.  

అఖ్నూర్‌లోని రెండు ఫార్వర్డ్ పోస్టులు, పాకిస్తాన్‌కు చెందిన సియోల్‌కోట్ ప్రాంతంలోని శత్రు పోస్టులపై మూడు రోజులు, మూడు రాత్రుల పాటు జరిపిన నిర్విరామంగా జరిపిన కాల్పులకు ఎదురొడ్డి ధైర్యసాహసాల్ని ప్రదర్శించారు. పాక్ సైన్యం చేస్తున్న కాల్పులకు ప్ర‌తిఘ‌టిస్తూ.. డ్రోన్లు, మోర్టార్‌ షెల్స్‌ను  కూల్చేశారు.  కాల్పుల ధాటికి కేవ‌లం 150 మీట‌ర్ల దూరంలో శత్రు దళాలు వెనక్కి తగ్గాయి. త‌మ స్థావ‌రాల్ని వ‌దిలి వెళ్లాయి.  

ఈ ఆరుగురిలో నలుగురు 2023లోనే బీఎస్‌ఎఫ్‌లో చేరారు. మంజీత్ కౌర్, మల్కీత్ కౌర్ వీళ్ల‌ద్ద‌రు పంజాబ్‌కు చెందిన వారు. ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో ఫార్వర్డ్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించగా, బీఎస్ఎఫ్‌లో కొత్తగా చేరిన  పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్వప్న రాథ్, శాంపా బసాక్, ఝార్ఖండ్‌కు చెందిన సుమి జెక్స్, ఒడిశాకు చెందిన జ్యోతి బనియన్లు శ‌త్రు దాడిని తిప్పికొట్టారు.

ఈ సంద‌ర్భంగా నేహా భండారి మాట్లాడుతూ.. మాకు శిక్షణ పురుష‌ జవాన్లతో సమానంగా ఇచ్చారు. ఆప‌రేష‌న్ సిందూర్ జ‌రిగే స‌మ‌యంలో పురుష సైన్యానికి స‌మానంగా శ‌త్రువుల‌ను ఎదుర్కొనేందుకు అవ‌కాశంగా భావించాం. దాయాది సైన్యాన్ని నిలువ‌రించాం. మా తాత, అమ్మా,నాన్నలు సైన్యంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు నాకు దేశం కోసం పనిచేసేందుకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం వీరి ధైర్య సాహసాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement