నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. "లీకులు ఆగలేదు.. కేవలం వేరే యాప్‌లకు మారిపోయాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు పేపర్ లీక్‌లకు టెలిగ్రామ్ కారణమా? అంటే.. లీకుల బెడద ఇంకా మిగిలే ఉందా?? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
భారత్‌లో 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారని, కొందరు దుర్వినియోగం చేశారనే కారణంతో మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సామాన్య వినియోగదారులకు శిక్ష విధించినట్టేనని దురోవ్ వ్యాఖ్యానించారు. పరీక్షా పత్రాల లీక్‌లు, మోసాలు టెలిగ్రామ్‌తో ఆగిపోవని, అవి ఇతర యాప్‌లకు మారిపోతాయని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో లీక్‌లు, స్కామ్‌లకు సంబంధించిన వందలాది ఛానెళ్లను తొలగించామని కూడా చెప్పారు.
నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు "PAPER LEAKED NEET", "RE-NEET 2026", "PRIVATE MAFIA" వంటి పేర్లతో నడుస్తున్న టెలిగ్రామ్ ఛానెళ్లు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్‌టీఏ గుర్తించింది. ప్రశ్నాపత్రాలు ఉన్నాయని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలు టెలిగ్రామ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఆరోపించింది.
అలాగే టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా అధికారుల ఆందోళనకు కారణమైంది. పరీక్షకు ముందు సాధారణ పోస్టులు పెట్టి, పరీక్ష తర్వాత వాటిని ఎడిట్ చేసి అసలు ప్రశ్నాపత్రాలను జతచేసి "ముందే లీక్ చేశాం" అంటూ స్క్రీన్‌షాట్లు వైరల్ చేస్తున్నారని ఎన్‌టీఏ పేర్కొంది. అందుకే జూన్ 30 వరకు ఆ ఫీచర్‌పై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.
వేరే యాప్‌లకు మారతాయా?
సాంకేతికంగా చూస్తే అవును అనే నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రశ్నాపత్రం లేదా సున్నిత సమాచారం బయటకు వస్తే అది టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్, డిస్కార్డ్, ఇ-మెయిల్, క్లౌడ్ డ్రైవ్‌లు లేదంటే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా క్షణాల్లో వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురోవ్(pavel durov) కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.
అయితే టెలిగ్రామ్‌లో లక్షల మంది సభ్యులతో పబ్లిక్ గ్రూపులు, భారీ ఫైల్ షేరింగ్, సెర్చ్ ద్వారా ఎవరైనా సులభంగా ఛానెళ్లను కనుగొనే సౌకర్యం ఉండటంతో మోసగాళ్లకు అది మరింత అనుకూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు.
టెలిగ్రామ్‌ను ఆపడం సాధ్యమేనా?
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెలిగ్రామ్‌ను పూర్తిగా అడ్డుకోవడం అంత సులభం కాదు. వీపీఎన్‌లు, ప్రాక్సీ సర్వర్లు, ప్రత్యేక ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీల కారణంగా వినియోగదారులు పలు మార్గాల్లో యాప్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చర్య ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.
ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత అది ఏ యాప్‌లో షేర్ అయ్యిందన్నది తర్వాతి విషయం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రశ్నాపత్రం పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అనేది. ప్రింటింగ్, రవాణా, భద్రతా వ్యవస్థలు, అంతర్గత ఉద్యోగుల పాత్ర, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవడం పూర్తి పరిష్కారం కాదని వారు చెబుతున్నారు.
జూన్ 22 తర్వాత..
ప్రభుత్వం ఈ చర్యను శాశ్వత నిషేధంగా కాకుండా తాత్కాలిక అత్యవసర చర్యగా పేర్కొంది. జూన్ 21న రీ-ఎగ్జామ్ పూర్తయ్యాక, జూన్ 22 నుంచి టెలిగ్రామ్ సేవలను పునరుద్ధరించే అవకాశముందని సమాచారం. అయితే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ఉన్న పరిమితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు. అయితే..
అయితే.. ఇదే అంశంపై డిజిటల్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పరీక్షల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేతలు కనిపించేవి. కానీ దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌పై నిషేధం విధించడం కొత్త పరిణామమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇతర సందర్భాల్లోనూ ఇలాంటి చర్యలకు ఇది నిదర్శనంగా మారుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, టెలిగ్రామ్‌పై వేటు వేయడం వల్ల కొంతకాలం మోసపూరిత ప్రచారానికి బ్రేక్ పడొచ్చు. కానీ దాంతో పేపర్ లీక్‌ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అసలు ప్రశ్న టెలిగ్రామ్‌లో ఏమి షేర్ అయ్యిందన్నది కాదు... ప్రశ్నాపత్రం మొదట పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అన్నదే. ఆ లీకేజీ మూలాలను గుర్తించి మూసేయకపోతే, వేదికలు మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నీట్ వివాదంలోనూ ఇదే కేంద్ర ప్రశ్నగా మారింది.


