ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత : ప్రధాని ప్రగాఢ సంతాపం

Narendra Modi Says India Grieves The Passing Away Of Pranab Mukherjee - Sakshi

ప్రముఖుల సంతాపం

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్‌ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్‌ విశేషంగా కృషి చేశారని అన్నారు.

రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రణబ్‌ ముఖర్జీ అందరికీ ఆరాధ్యులని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పలు పాలనా విధానాలపై ఆయన చేసిన సూచనలు సదా స్మరణీయమని చెప్పారు. భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ప్రణబ్‌ భరతమాత ముద్దుబిడ్డ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రణబ్‌ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్‌ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఇక ప్రణబ్‌ ముఖర్జీ క్రమశిక్షణ, అంకిత భావంతో దేశానికి సమున్నత సేవలు అందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివంగత నేతకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గొప్ప నేతను కోల్పోయాం : అమిత్‌ షా  

దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్‌ షా ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, ఆయన మాతృభూమికి ఎనలేని సేవ చేశారని ప్రస్తుతించారు.

రాహుల్‌ సంతాపం
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్‌ మృతి పట్ల యావత్‌ జాతి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోందని రాహుల్‌ అన్నారు
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top