నాగరిక దేవో భవ! | Narendra Modi interacted with 183 Officer Trainees of IAS 2024 batch | Sakshi
Sakshi News home page

నాగరిక దేవో భవ!

Jun 24 2026 3:54 AM | Updated on Jun 24 2026 3:54 AM

Narendra Modi interacted with 183 Officer Trainees of IAS 2024 batch

ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేయండి

దేశ నిర్మాణానికి సమన్వయం అత్యంత కీలకం

యువ ఐఏఎస్‌లతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అధికార విధుల్లో ఉండగా తమ వద్దకు వచ్చే ప్రతి ఫైలునూ అసంఖ్యాక పౌరుల జీవితాలకు, వారి ఆకాంక్షలకు ప్రతినిధిగా భావించాలని యువ ఐఏఎస్‌ అధికారులకు ప్రధాని మోదీ ఉద్బోధించారు. అలాగే, ప్రభుత్వ పాలన ఎల్లప్పుడూ సానుభూతితో స్పందిస్తూ, అందరినీ కలుపుకుపోతుండాలని ఆయన కోరారు. మంగళవారం తన వద్దకు వచ్చిన 183 మంది 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌ ట్రెయినీ అధికారులతో ఆయన మాట్లాడారు. వీరంతా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా అటాచ్‌ అయ్యారు.

‘అభివృద్ధి పరంగా ఎదురయ్యే ప్రధాన సవాళ్లను ఎవరికివారుగా పరిష్కరించడం సాధ్యం కాదు. అర్ధవంతమైన, శాశ్వతమైన ఫలితాలను సాధించాలంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం అత్యంత కీలకం’అని మోదీ తెలిపారు. యువ అధికారులు బలమైన లక్ష్య శుద్ధి, ఆవిష్కరణలు, ప్రజా కేంద్రిత పాలనా విధానంతో దేశ నిర్మాణానికి అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ప్రతి పరిపాలనా ఫైలు వెనుక ఒక సామాన్యుడి జీవితంపై పడే ప్రభావాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని వారిని కోరారు.

పౌరుడికే ప్రథమ ప్రాథామ్యం
నాగరిక్‌ దేవో భవ అనే మంత్రాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకుని తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశ నిర్మాణంలో తమ వంతు పాత్రను నిరంతరం సమీక్షించుకుంటూ ఉండాలని, నిర్వహించే బాధ్యతలను బట్టి కాకుండా సాధించిన స్పష్టమైన ఫలితాల ద్వారా సంతృప్తిని పొందాలని సూచించారు. ‘రెండేళ్ల పాటు క్షేత్రస్థాయి పరిశీలన, పరిపాలనాపరమైన అనుభవం తర్వాత ఇప్పుడు మీరు ఒక కీలకమైన దశలో ఉన్నారు. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కేవలం మీ కెరీర్‌ను మాత్రమే కాదు, కోట్లాది పౌరుల భవిష్యత్తును సైతం మారుస్తాయి’అని మోదీ వారితో అన్నారు. నిజాయితీ, సున్నితత్వం, నిబద్ధతతో నిజజీవిత పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే ప్రజా సేవలో అసలైన పరీక్ష మొదలవుతుందని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యం
వికసిత్‌ భారత్‌ 2047 దార్శనికతను ప్రస్తావించిన మోదీ.. ‘రాబోయే దశాబ్దాలలో తీసుకునే ప్రతి విధానం, పరిపాలనాపరమైన నిర్ణయం కూడా అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించే దిశగానే సాగాలి. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేయాలి. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతలలో ’ఆత్మనిర్భర్‌ భారత్‌’, ’మేక్‌ ఇన్‌ ఇండియా’, ఉత్పాదక రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలను సృష్టించడం వంటివి ఉన్నాయి’అని యు ఐఏఎస్‌లకు ఆయన వివరించారు. ప్రస్తుత బ్యాచ్‌లోని ఐఏఎస్‌ అధికారులలో 40 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.

వారి శక్తి, ప్రతిభ, అంకితభావం దేశ అభివృద్ధి ప్రయాణాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు తమకు కేటాయించిన విభాగాల్లో ఎదురైన సొంత అనుభవాలను ప్రధానికి వివరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ప్రధాని ప్రధాన కార్యదర్శులు పి.కె.మిశ్రా, శక్తికాంత దాస్, క్యాబినెట్‌ సెక్రటరీ టీవీ సోమనాథన్, లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ శ్రీరామ్‌ తరణికాంతి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement