
సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశవాణికి పూర్వవైభవం తెస్తామని, ప్రజల రోజువారీ జీవనంలో భాగమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తామని ఆల్ ఇండియా రేడియో నూతన డైరెక్టర్ జనరల్ నూకల వేణుధర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వైద్యం, ఆరోగ్యం సహా అన్ని రంగాలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడం తమ ప్రధాన కర్తవ్యమని వివరించారు. ఆరోగ్యకరమైన వినోదానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని తెలిపారు. స్థానిక, గిరిజన కళాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు రూపొందిస్తామని వివరించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు స్టేషన్ స్థాయిలో వక్తృత్వ, సంగీత తదితర పోటీలు నిర్వహించడం ద్వారా రేడియోను పాఠశాలల స్థాయి వరకు చేరువ చేస్తామని వేణుధర్‌రెడ్డి వివరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఆయన తాజాగా డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎరిజెర్ల గ్రామానికి చెందిన వేణుధర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) 1988 బ్యాచ్ అధికారి. 1990–2000 కాలంలో అకాశవాణి, దూరదర్శన్‌లో న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన ఆయన 2009–17 మధ్య సమాచార ప్రసార శాఖలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా, 2017–21 మధ్య కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.