ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్‌ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు.
అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు.
44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు.


