పెళ్లయిన కుమార్తె కూడా కుటుంబంలో భాగమే | Married Daughter Cannot Be Excluded From Compassionate Appointment: Supreme Court | Sakshi
Sakshi News home page

పెళ్లయిన కుమార్తె కూడా కుటుంబంలో భాగమే

Jun 3 2026 5:32 AM | Updated on Jun 3 2026 5:32 AM

Married Daughter Cannot Be Excluded From Compassionate Appointment: Supreme Court

వివాహమైందని సంక్షేమ పథకాన్ని నిరాకరించలేం

సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు కొట్టివేత

సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లియిందనే కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకం నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబం నిర్వచనంలో పెళ్లి అయిన కుమార్తె కూడా భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు అలహాబాద్‌ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సోమవారం జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ అలోక్‌ అరాధేల ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతకు అడ్డంకి కాదని, అర్హత కలిగిన కుమార్తెకు కేవలం వైవాహిక హోదా కారణంగా సంక్షేమ పథకాన్ని నిరాకరించలేమని తెలిపింది. ఈ విషయంలో బాంబే, కర్ణాటక హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులతో ఏకీభవిస్తున్నట్లు వెల్లడించింది. 

కేసు వివరాలివీ..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుల్సుమ్‌ నిషా తల్లి చౌక ధరల దుకాణం డీలర్‌గా ఉండేవారు. కుల్సుమ్‌ నిషా పెళ్లయినప్పటికీ, భర్తతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండేవారు. దివ్యాంగురాలైన తన సోదరి బాగోగులు చూసుకుంటూ, తల్లికి దుకాణం నిర్వహణలో సాయం చేసేవారు. తల్లి మరణించిన తర్వాత, కారుణ్య ప్రాతిపదికన ఆ దుకాణం లైసెన్స్‌ తనకు ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 2019లో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి పెళ్లయిన కూతుళ్లను తొలగించింది. ఈ జీవోను సాకుగా చూపి ఆమె దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

భిన్న తీర్పుల నేపథ్యంలో సుప్రీంకు బదిలీ 
కేసును విచారించిన అలహాబాద్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి, గత తీర్పులను పరిశీలించారు. వాటిలో ప్రధానంగా..
విమల్‌ శ్రీవాస్తవ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ. (2015) కేసులో.. ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలకు సంబంధించిన ‘ఉత్తరప్ర దేశ్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ డిపెండెంట్స్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ సర్వెంట్స్‌ డైయింగ్‌–ఇన్‌– హార్నెస్‌ రూల్స్, 1974’ లోని ‘‘కుటుంబం’’నిర్వచనాన్ని విశ్లేషించింది. వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టి కల్‌ 14, 15లకు విరుద్ధమని, అది వివక్ష తో కూడుకున్నదని తేల్చింది. కుటుంబం నిర్వచనంలో ఉన్న ‘అవివాహిత’అనే పదాన్ని కొట్టివేసింది. 

 కుసుమ్‌లత వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ కేసు (2021)లో అయితే.. 2019 జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన మరో కేసులో సింగిల్‌ జడ్జి, విమల్‌ తీర్పులో వచ్చినది ఇక్కడ వర్తించదని పేర్కొన్నారు. 2019 జీవోలో ‘అవివాహిత కుమార్తె’అని ఉండటం వివక్ష కాదని తేల్చారు. ‘హార్నెస్‌ రూల్స్‌’ను అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా 2019 జీవోను వ్యాఖ్యానించలేమని చెప్పారు.

 సైదా బేగం వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీ కేసు (2023)లో.. డివిజన్‌ బెంచ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలా ఒకే హైకోర్టులో భిన్న తీర్పులు రావడంతో పాటు, ఇతర హైకోర్టుల అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నాయి. బాంబే హైకోర్టు ‘రంజనా మురళీధర్‌ అనే రావ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (2014)’కేసులో, లైసెన్సింగ్‌ ఆర్డర్, 1979 కింద మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తీర్మానంలో ‘కుటుంబం’నిర్వచనం నుంచి వివాహం అయిన కుమార్తెలను మినహాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 15, 19(1)(జీ)లకు విరుద్ధమని తీర్పు ఇచ్చింది. గుజరాత్‌ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ భిన్నమైన తీర్పుల నేపథ్యంలో, స్పష్టత కోసం అలహాబాద్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు.

4 వారాల్లో లైసెన్స్‌ ఇవ్వాలని ఆదేశం
తీర్పు సందర్భంగా.. బాంబే హైకోర్టు రంజనా కేసులో ఇచ్చిన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అలహాబాద్‌ హైకోర్టు సైదా బేగం కేసులో ఇచ్చిన తీర్పు సరైంది కాదని తేల్చి చెప్పింది. ‘ఈ కేసులో రికార్డుల ప్రకారం, అప్పీలుదారు పెళ్లి తర్వాత కూడా అదే గ్రామంలో నివాసం ఉంటూ, తన తల్లికి చౌక ధరల దుకాణం నడపడంలో సాయం చేసేవారు. తల్లి మరణం తర్వాత, ఆమె తన సోదరి, శారీరక వైకల్యం ఉన్న మరో సోదరి బాధ్యతలను తీసుకుంది. ఆమె వివాహిత అనే కారణంతో దరఖాస్తును తిరస్కరించడం రాజ్యాంగపరంగా చెల్లదు’అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్‌కు లైసెన్స్‌ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన ధర్మాసనం, నాలుగు వారాల్లోగా కుల్సుమ్‌ నిషాకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌ జారీ చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా ఆదేశించింది.  

Advertisement
 
Advertisement
Advertisement