తెలంగాణ గ్రేహౌండ్స్‌ ఆపరేషన్‌లో హిడ్మా హతం?

Maoist central committee member Madvi Hidma was Killed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. బీజాపూర్‌- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌ కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇదిలా ఉంటే, మావోయిస్టు కేంద్ర కమిటీ హిడ్మా మృతిని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది.

కాగా, 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే మావోయిస్టు, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చిన మావోయిస్టు హిడ్మా. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. 

చదివింది మాత్రం 7వ తరగతే అయినా  మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు హిడ్మా. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్‌ కావడంతో.. హిట్‌ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్‌ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి పార్టీ, రెండోది సాయుధ బలగం, మూడు ప్రజా ప్రభుత్వం. మూడు విభాగాల్లోనూ పని చేసిన హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top