
మాలెగావ్ పేలుడు కేసులో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
మొత్తం ఏడుగురు నిందితులకూ విముక్తి
ముంబై: మహారాష్ట్రలోని మాలెగావ్ పట్టణంలో 17 ఏళ్ల క్రితం ఆరుగుర్ని బలి తీసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులోని మొత్తం ఏడుగురు నిందితులపై కేసులను కొట్టివేసింది. వీరికి వ్యతిరేకంగా ఎటువంటి నమ్మదగిన, బలమైన సాక్ష్యాధారాలు లేవని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఉగ్రవాదానికి మతం లేదు, అనుభవం, సమాచారం ప్రాతిపదికన దోషులుగా తేల్చలేమని తెలిపింది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన మాలెగావ్‌లోని ఓ మసీదు వద్ద మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలి ఆరుగురు చనిపోగా 101 మంది గాయాలపాలయ్యారు. పేలుడు పదార్థం మోటారు సైకిల్‌కు అమర్చిందేనని, ఆ మోటారు సైకిల్ ఠాకూర్‌దే అని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు జడ్జి ఏకే లహోటీ పేర్కొన్నారు.
ఈ కేసులో చాలా లోపాలున్నాయని, సరైన ఆధారాలు లేకపోవడంతో సంశయలాభం నిందితులకే అనుకూలంగా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసును చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా) నిబంధనలను వర్తింపజేయలేమని చెప్పారు. పేలుడులో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులైన 101 మందికి రూ.50 వేల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కాగా, తీర్పు సందర్భంగా కోర్టు పరిసరాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బెయిల్‌పై ఉన్న నిందితులందరూ కోర్టుకు హాజరయ్యారు. నిందితులపై ఐపీసీ, ఆయధాల చట్టంతోపాటు ఉపా కింద కేసులు నమోదయ్యా యి. ఈ పేలుడుకు ‘అభినవ్ భారత్’ గ్రూపునకు చెందిన హిందూ అతివాదులే కారణమని, స్థానిక ముస్లింలను భయభ్రాంతులకు గురిచేయడమే వీరి లక్ష్యమని ప్రాసిక్యూషన్ వాదించింది.
ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ చేపట్టింది. 2018లో మొదలైన కేసు విచారణ ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన ముగియగా గురువారం తీర్పు వెలువరించింది. ఈ పేలుడుతో ఠాకూర్‌కు సంబంధం లేదని ఎన్‌ఐఏ ఇప్పటికే స్పష్టీకరించినప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. మత విద్వేషాలను పెంచడం, స్థానిక ముస్లింలలోని ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురి చేయడమే కుట్రదారుల లక్ష్యమని ఎన్‌ఐఏ కోర్టులో వాదనలు వినిపించింది.
మొత్తం 323 మంది సాక్షులను విచారించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తికి ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది నాకు మాత్రమే కాదు, యావత్ కాషాయ దళానికి దక్కిన విజయం. ఈ కేసు కారణంగా గత 17 ఏళ్లుగా నా జీవితం నాశనమైంది. సన్యాసి అయినందునే మనుగడ సాగించగలిగా. కాషాయాన్ని అవమానించిన వారిని ఆ దేవుడే శిక్షించాడు’అని ప్రజ్ఞా ఠాకూర్ పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకున్నా తనను ఈ కేసులో ఇరికించారని కల్నల్ ప్రసాద్ పురోహిత్ పేర్కొన్నారు. ఎప్పటి మాదిరిగానే దేశ సేవను ఇకపైనా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
సోనియా, రాహుల్ క్షమాపణ చెప్పాలి
పేలుడు సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ ఆధారాలూ లేకున్నా ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై అనవసర ఆరోపణలు చేసిందని బీజేపీ ఆరోపించింది. పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని నిలదీసింది.
టైమ్ లైన్..
తేదీ: సెప్టెంబర్ 29, 2008
స్థలం: మాలేగావ్, మహారాష్ట్ర
పేలుడు: ద్విచక్ర వాహనంలో అమర్చిన IED
ప్రభావం: 6 మంది మృతి, 95 మంది గాయాలు (ప్రాథమికంగా 101 అని పేర్కొన్నా, కోర్టు 95 అని తేల్చింది)
నిందితులు:
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ (మాజీ BJP MP)
లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్
మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ (రిటైర్డ్)
సమీర్ కులకర్ణి
అజయ్ రహిర్కర్
సుధాకర్ చతుర్వేది
సుధాకర్ ధర్ ద్వివేది
ఎన్‌ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు:
పేలుడు జరిగినట్లు నిరూపించబడింది, కానీ బాంబు మోటార్‌సైకిల్‌లో పెట్టినట్లు నిరూపించలేకపోయారు.
ఆ బైక్ కూడా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు చెందినదిగా నిరూపించలేకపోయారు
UAPA చట్టం వర్తించదు.. ఎందుకంటే అనుమతి పత్రాలు సరిగా లేవు.
ఫింగర్‌ప్రింట్లు, డంప్ డేటా, స్పాట్ స్కెచ్ వంటి ఆధారాలు సేకరించలేకపోయారు
కాబట్టి నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం