స్కూలు ఫీజులు పెంచారని చెబితే.. వెళ్లి చావండన్న మంత్రి

Madhya Pradesh Minister Inder Singh Parmar Shocking Comment Towards Parents Union - Sakshi

భోపాల్‌: స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తమ గోడును వెళ్లబోసుకోవడానికి వెళ్లిన పేరెంట్స్‌పై సాక్షాత్తు విద్యాశాఖ మంత్రే నోరు పారేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్‌లోని స్కూలు పిల్లల తల్లిదండ్రులు మధ్యప్రదేశ్‌ పాలక్‌ మహాసంఘ్‌ అనే బ్యానర్‌ కింద ఓ యూనియన్‌గా ఏర్పడి, అధిక ఫీజుల విషయమై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్‌ను కలిసేందుకు అతని నివాసం వద్దకు వెళ్లారు. కరోనా కారణంగా అధిక స్కూల్ ఫీజులు భారంగా మారాయని, వెంటనే వాటిని నియంత్రించాలని వారు మంత్రికి మొరపెట్టుకున్నారు.

అయితే ఈ విషయంలో సదరు మంత్రి స్పందన చూసి పేరెంట్స్‌ కమిటీ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పేరెంట్స్‌ అభ్యర్ధనను విన్న మంత్రి.. ‘వెళ్లి చావండి, మీకిష్టమొచ్చినట్టు చేసుకోండి’ అంటూ తిట్టిపోయడంతో అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఈయనేం మంత్రిరా బాబు..! బాధను చెప్పుకుందామని వెళితే మాపైనే ఫైరయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను అక్కడున్న సభ్యులు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. 

తలిదండ్రుల బాధను అర్ధం చేసుకోకుండా, నోరు పారేసుకున్న మంత్రిని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. కాగా, కరోనా విపత్కర పరిస్థితుల్లో స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆ రాష్ట్ర హైకోర్టు ఇదివరకే తీర్మానం చేసింది. కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విద్యాసంస్థలను ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పును బేఖాతరు చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు సంబంధిత మంత్రికి తమ గోడు వెళ్లబుచ్చుకుందామని వెళ్లారు.

బాధితుల ఫిర్యాదుకు మంత్రి రెస్పాన్స్ చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. తమపై నోరుపారేసుకున్న మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి ముందే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ విషయమై వెంటనే కల్పించుకుని తమకు న్యాయం జరిగేలా చూడటంతో పాటు సంబంధిత మంత్రిని ప్రభుత్వం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పేరెంట్స్‌ కమిటీ పోరాటానికి ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలపడంతో మంత్రి రాజీనామా విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ విషయమై మంత్రి స్పందించకపోవడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top