స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు

Kerala School Dropout Surendran Who Rolled Beedis Now A US Judge - Sakshi

తిరువనంతపురం: కష్టాలు వచ్చాయని ఆయన కుంగిపోలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు. తల్లిదండ్రులకు సాయం చేసేందుకు బీడీలు చుట్టారు. ఇళ్లల్లో పని మనిషిగానూ చేశారు. కట్‌ చేస్తే ప్రస్తుతం అమెరికాలో జడ్జీగా నియమితులై తీర్పులు చెబుతోంది. ఆయనే కేరళలోని కాసరగోడ్‌ ప్రాంతానికి చెందిన 51 ఏళ్ల సురేంద్రన్‌ కే పటేల్‌. ఇటీవలే అమెరికాలోని టెక్సాస్‌లో జిల్లా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాను గతంలో  బీడీలు చుట్టడం, పని మనిషిగా చేయటమే తన విజయానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు సురేంద్రన్‌.

‘పైచదువులు చదివించే స్తోమత నా కుటుంబానికి లేకపోవడంతో 10వ తరగతి తర్వాత చదువు మానేశాను. రోజువారీ కూలీగా ఏడాది పాటు బీడీలు చుట్టాను. అదే జీవితంపై నా దృక్పథాన్ని మార్చేసింది.’అని పేర్కొన్నారు సురేంద్రన్‌ కే పటేల్‌. తన జీవితాన్ని మార్చుకునేందుకు చదువుకోవాలని నిర్ణయించుకున్నాని, అందుకోసం గ్రామంలోని తన స్నేహితులను సాయం చేయాలని కోరినట్లు గుర్తు చేసుకున్నారు. లా డిగ్రీ వరకు తనకు స్నేహితులు ఎంతగానో సాయపడినట్లు చెప్పారు. చదువుకునే రోజుల్లో ఓ హోటల్‌లో హౌస్‌కీపింగ్‌ జాబ్‌ చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన తర్వాత చేసిన ప్రాక్టీస్‌ అమెరికాలో నిలదొక్కుకునేందుకు సాయపడిందన్నారు. 

అమెరికాలోనూ తన జర్నీ అంత సాఫీగా సాగలేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తు చేసుకున్నారు సురేంద్రన్‌. ‘టెక్సాస్‌లో ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నంలో నా మాటతీరుపై కామెంట్లు చేశారు. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేశారు. నేను డెమోక్రటిక్ ప్రైమరీకి పోటీ చేసినప్పుడు నేను గెలవగలనని నా సొంత పార్టీ అనుకోలేదు. ఈ స్థాయికి వస్తానని ఎవరూ నమ్మలేదు. కానీ, నేను ఇక్కడ ఉన్నాను. అందరికి ఒకే ఒక్క సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఎవరికీ ఇవ్వకు. ఆ నిర్ణయం నీ ఒక్కడిదే. ’ అని తెలిపారు సురేంద్రన్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top