గోల్డు స్మగ్లింగ్‌ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్‌ ఇవ్వొద్దు

Kerala High Court Tells NIA While Opposing Swapna Suresh Bail Plea - Sakshi

దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు 

స్వప్నా సురేష్‌తోపాటు నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దు 

కేరళ హైకోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి

కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్‌ నుంచి 2020 జూన్‌ వరకు స్వప్నా సురేష్‌తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్‌ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్‌–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్‌ఏఐ స్పష్టం చేసింది.

స్వప్నాసురేష్‌తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్‌ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఎన్‌ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్‌ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్‌ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది.

నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్‌ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్‌తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్‌ చేసినట్లు తేలింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top