
బెంగళూరు: కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. తల్లీ కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ ఆసుపత్రి నర్సుల క్వార్టర్స్‌లో జరిగింది. ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న శ్రుతి(38) తన కూతురు పూర్విక(12)ని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శృతి భర్త రాత్రి షిఫ్ట్ ముగించుకుని ఇంటికి తిరిగి రాగా, తలుపు లోపల గడియ పెట్టి ఉంది.
దీంతో అతను పొరుగువారి సాయంతో తలుపును పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది. ఆరో తరగతి చదువుతున్న కూతురు పూర్విక తలకు గాయాలతో పడి ఉంది. పూర్విక మృతదేహం పక్కనే శృతి ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం శృతి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.