Karnataka HC: భార్యతో భర్త రిలేషన్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Karnataka High Court Says Husband Cannot Use Wife As An ATM - Sakshi

బనశంకరి: ఎలాంటి భావనాత్మక సంబంధం లేకుండా, భార్య అంటే డబ్బును అందించే ఏటీఎం యంత్రంలా వాడుకోవడం మానసిక వేధింపులతో సమానమని  హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను రద్దుచేసి మహిళ ఆకాంక్ష మేరకు విడాకులను మంజూరు చేసింది.  

వ్యాపారాలని డబ్బు కోసం ఒత్తిళ్లు 
వివరాలు... బెంగళూరులో 1991లో వివాహమైన దంపతులకు 2001లో ఆడపిల్ల పుట్టింది. వ్యాపారం నిర్వహిస్తున్న భర్త అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఇంట్లో నిత్యం గొడవలు జరిగేవి. ఈ సమయంలో భార్య ఉపాధి కోసం బ్యాంకు ఉద్యోగంలో చేరింది. 2008లో  భర్త దుబాయిలో సెలూన్‌ తెరుస్తానంటే రూ.60 లక్షలు ఇచ్చింది. కానీ అక్కడ కూడా నష్టాలు రావడంతో భర్త మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. నిత్యం డబ్బు కావాలని పీడిస్తుండడంతో తట్టుకోలేక ఆమె విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో బాధిత మహిళ హైకోర్టును ఆశ్రయించింది. 

భర్త ధోరణిపై జడ్జిల ఆగ్రహం 
మంగళవారం ఈ కేసును హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్‌ అలోక్‌ ఆరాదే, జేఎం.ఖాజీల ధర్మాసనం విచారించింది. భార్యతో ఆ భర్త ఎలాంటి అనుబంధం లేకుండా యాంత్రికంగా భర్త పాత్ర పోషిస్తున్నాడని, ఆమెను కేవలం డబ్బులు ఇచ్చే ఏటీఎంగా వాడుకుంటున్నాడని జడ్జిలు పేర్కొన్నారు. భర్త ప్రవర్తనతో భార్య మానసికంగా కుంగిపోయిందని ఇది మానసిక వేధింపులతో సమానమని స్పష్టం చేశారు. కానీ ఫ్యామిలీ కోర్టు ఈ అంశాలను పరిగణించడంలో విఫలమైందన్నారు. కేసును కూడా సక్రమంగా విచారించలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. భార్య వాదనను పరిగణించిన హైకోర్టు ఆమెకు విడాకులు మంజూరుచేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top