Karnataka Assembly Elections: 52 కొత్త ముఖాలకు టిక్కెట్లు.. బీజేపీలో భగ్గుమన్న అసమ్మతి.. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌ బై!

Karnataka Assembly Elections 2023: Former deputy CM Laxman Savadi said BJP has not remained a political party - Sakshi

బెంగళూరు: కర్ణాటక బీజేపీలో అసమ్మతి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 52 కొత్త ముఖాలకు టిక్కెట్‌లు ఇస్తూ విడుదల చేసిన తొలి జాబితా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్‌ రాని అసంతృప్త  నాయకులు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌ బై కొడుతున్నారు. మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోతామంటూ బెదిరింపులకి దిగుతున్నారు. ఆశావహుల మద్దతుదారులు బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలకు కూడా దిగారు. సీనియర్‌ నేత లక్ష్మణ్‌ సావాది, మాజీ ఎమ్మెల్యే దొడ్డప్పగౌడ పాటిల్‌ నారిబోల్‌లు పార్టీకి బుధవారం గుడ్‌బై కొట్టేశారు.

సలియా  నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎస్‌. అంగారా టికెట్‌ రాకపోవడంతో ఏకంగా రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మణ్‌ సావాది మాజీ సీఎం బీఎస్‌ యడ్డీయూరప్పకి అత్యంత విధేయుడు, శక్తిమంతమైన లింగాయత్‌ నాయకుల్లో ఒకరు. 2018 ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుదారుల్ని ఆకర్షించడంలో పకడ్బందీగా వ్యూహాలు పన్నారు.

ఈసారి టికెట్‌ రాకపోవడంతో   సావాది తాను ఎవరినీ బిచ్చమడగనని, తనకి ఆత్మ గౌరవం ఉందని వ్యాఖ్యానించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారంటున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డప్ప గౌడ కూడా రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టార్‌ పేరు తొలిజాబితాలో లేకపోయేసరికి ఆగ్రహావేశాలతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. టికెట్‌ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక మంత్రి అంగారా పార్టీ తనను తీవ్రంగా అవమానించిందంటూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top