ఇదే సరైన సమయం.. కమల్‌హాసన్‌ బహిరంగ లేఖ | Kamal Haasan Pens Open Letter On Rising Cinema Costs | Sakshi
Sakshi News home page

ఇదే సరైన సమయం.. కమల్‌హాసన్‌ బహిరంగ లేఖ

May 15 2026 9:23 PM | Updated on May 15 2026 9:38 PM

Kamal Haasan Pens Open Letter On Rising Cinema Costs

చెన్నై: భారతీయ సినీ పరిశ్రమను ఉద్దేశించి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం మరింత తీవ్రమవుతోందన్న కమల్‌.. ఇంధనం, వాణిజ్యం, రవాణా, ఆర్థిక స్థిరత్వంపై ప్రపంచం ఒత్తిడిని ఎదుర్కొంటోందన్నారు. భారతీయ చిత్ర పరిశ్రమ కూడా ప్రభావితమవుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

‘‘పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం వినియోగదారుల ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చు. ఆ భారం అనివార్యంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు, ఫైనాన్షియర్లు, మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా రంగం అభివృద్ధి చెందాలంటే, ఖర్చు చేసే ప్రతి రూపాయి కేవలం భారీ స్థాయి ప్రదర్శనకే కాకుండా, సినిమాకే ఉపయోగపడేలా మనం నిర్ధారించుకోవాలి.’’ అని కమల్‌హాసన్‌ లేఖలో సూచించారు.

‘‘ప్రతి ప్రేమకథ పారిస్‌లోనే ఎందుకు వికసించాలి. ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి?. అదృష్టవశాత్తూ ప్రేమకు విదేశీ మారకద్రవ్యం అవసరం లేదు. భారతీయ సినిమా పరిశ్రమలోని వ్యక్తులు ఒకే అభిప్రాయానికి రావడానికి ఇదే సరైన సమయం. ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై పరిశ్రమ వ్యాప్తంగా చర్చ జరగాలి. నిర్మాతలు, నటీనటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, గిల్డ్‌ల మధ్య సంప్రదింపులు జరగాలి.

సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం, మనమందరం కలిసి ఆచరణాత్మకమైన, సుస్థిరమైన నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేసుకోవాలి. అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్‌లు, స్టూడియోల అంతటా విద్యుత్ ఆదా చేయడం, సుస్థిరమైన సెట్ నిర్మాణం, వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం చేయాలి. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం.

మన పరిశ్రమ సంస్కృతిని తీర్చిదిద్దుతుంది, ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. సినిమా కేవలం వినోదానికి మించిన బాధ్యతలను కలిగి ఉంటుంది. ఈ పరిశ్రమ నుండి అత్యధికంగా లబ్ధి పొందిన మనము ముందుగా ఆదర్శంగా నిలవాలి. ఈ రోజు సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడగలిగితే, రేపటి సినిమా భవిష్యత్తును కాపాడగలిగినట్లే’’ అంటూ కమల్‌హాసన్‌ లేఖలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement