‘పదవి అవసరం లేదు, పార్టీలో తగిన గౌరవం ఉంది’

భోపాల్: ఏ పదవులు ఆశించి తాను బీజేపీలో చేరాలేదని, ఆ పార్టీలో తనకు చాలా గౌరవం లభిస్తునందుకు ఆనందంగా ఉందని మధ్య ప్రదేశ్ ఫైర్ బ్రాండ్ జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల నేపథ్యంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఆయన కేవలం ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. తన తండ్రి లాగానే తనకి కూడా ఏ పదవి కాంక్ష లేదని అన్నారు. మీకు క్యాబినేట్ మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మీరు ఎలా భావిస్తున్నారు అని ప్రశ్నించగా తాను పదవి కోసం పార్టీ మారలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలను ఇచ్చిందని కానీ వాటిని నెరవేర్చలేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, మహిళలను, నిరుద్యోగులను కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు చెప్పారు.
ఇక పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ గురించి ప్రశ్నించగా పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పమని ఆదేశించిన కమల్‌నాధ్ చెప్పలేదని, అలాంటి దురుసు ప్రవర్తన కలిగిన నేతను తానెప్పుడు చూడలేదని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మహిళలలు అన్నా, దళితులు అన్నా గౌరవం లేదని అందుకే కింది స్థాయి నుంచి ఎదిగిన మహిళను ఐటెమ్ అని సంబోధించడం బట్టే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. చదవండి: ‘నాకు ఉప ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చారు’