జోద్‌పూర్‌లో ఉద్రిక్తతలు.. ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

In Jodhpur, Curfew imposed in Some Parts amid Tensions on Eid - Sakshi

జోథ్‌పూర్‌/జైపూర్‌: రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సొంతూరు జోద్‌పూర్‌లో మత ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో కర్ఫ్యూ విధించడంతో పాటు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేయాల్సి వచ్చింది. జలోరి గేట్‌ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి కాషాయ జెండాలను తొలగించి ముస్లిం జెండాలను ఏర్పాటు చేశారన్న వార్తలతో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మంగళవారం ఉదయం ఈద్గా వద్ద ప్రార్థనల తర్వాత జలోరి గేట్‌ ఏరియాలో దుకాణాలు, వాహనాలు, నివాసాలే లక్ష్యంగా మళ్లీ రాళ్ల వాన కురిసింది. దాంతో లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం జరిగాయి. ముగ్గురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ముందు జాగ్రత్తగా 10 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం అర్ధరాత్రి దాకా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతోపాటు నిషేధాజ్ఞలు విధించారు. ఉద్రిక్తతలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గహ్లోత్‌ ఆదేశించారు.

ఇప్పటి వరకు 50 మందిని అదుపులోకి తీసుకున్నారని హోం మంత్రి రాజేంద్ర యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ విమర్శించింది. ఈ గొడవల్లో ఒకరు కత్తిపోట్లకు గురై మృత్యువుతో పోరాడుతున్నాడని, దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయజూశారని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోపించారు. 

చదవండి: (Navneet Rana: నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top