
పట్నా: బీహార్ ఎన్నికలకు ముందుగానే ఎన్‌డీఏలో అసంతృప్తి మొదలయ్యింది. మిత్రపక్షం హిందూస్తానీ అవామ్ మోర్చా(హెచ్‌ఏఎం) నేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే, అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరింపులకు దిగారు. అయితే తాము ఎన్‌డీఏ శిబిరంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ అంశంలో జోక్యం చేసుకుని మాంఝీని, శాంతింపజేసే ప్రయత్నం చేశారని సమాచారం.
‘ప్రాధాన్యత కలిగిన పార్టీగా గుర్తింపు పొందేందుకు మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు అవసరం. ప్రతిపాదిత సంఖ్యలో సీట్లు మాకు లభించకపోతే, మేము ఎన్నికల్లో పోటీ చేయబోము. అయితే మేము ఎన్‌డీఏకి మద్దతు ఇస్తాం. కానీ ఎన్నికల్లో పోటీకి దిగం. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను’ అని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.
ఇంకా తేలని సీట్ల భాగస్వామ్య సూత్రం
నవంబర్‌లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏ మిత్రపక్షాలు ఇంకా తమ సీట్ల భాగస్వామ్య సూత్రాన్ని ప్రకటించలేదు. అయితే మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం జేడీయూ, బీజేపీలు దాదాపు 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ(రామ్ విలాస్) 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. కాగా ఈ తరహా సీట్ల కేటాయింపుపై మాంఝీతో పాటు, చిరాగ్ పాశ్వాన్ కూడా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వారిద్దరూ కనీసం 40 సీట్ల కోసం ఎన్‌డీఏపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే..
దేశంలోని అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.
ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలు
ఆపరేషన్ సిందూర్, జీఎస్‌టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్‌లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.
ప్రతి రెండు గంటలకు కౌంటింగ్ అప్‌డేట్
పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్‌లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్‌డేట్ చేస్తారు.