సూపర్‌ఫుడ్‌ స్వీటెనర్‌గా బెల్లం | Jaggery as a superfood sweetener | Sakshi
Sakshi News home page

సూపర్‌ఫుడ్‌ స్వీటెనర్‌గా బెల్లం

May 17 2026 4:38 AM | Updated on May 17 2026 4:38 AM

Jaggery as a superfood sweetener

ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో 70% భారత్‌దే వాటా

2015–16లో 197 మిలియన్‌ డాలర్ల ఎగుమతులు

2024–25 నాటికి 406.8 మిలియన్‌ డాలర్లకు పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వంటింట్లో శతాబ్దాలుగా భాగమైన బెల్లం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘సూపర్‌ఫుడ్‌ స్వీటెనర్‌’గా గుర్తింపు పొందుతోంది. సహజ పద్ధతుల్లో తయారయ్యే ఈ సంప్రదాయ తీపి పదార్థం ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ డిమాండ్‌ను సాధిస్తోంది. ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో 70 శాతానికి మించిన వాటాతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 

దేశంలో ఉత్పత్తయ్యే చెరకు పంటలో 20 నుంచి 30 శాతం బెల్లం తయారీకే వినియోగమవుతున్నట్లు కేంద్రం శనివారం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయి పరిశ్రమలు, కుటీర పరిశ్రమల రూపంలో కొనసాగుతున్న బెల్లం తయారీ రంగం సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ విలువను అందించే వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తోందని వివరించింది.

ఎగుమతుల్లో తీపి
భారత్‌ బెల్లం, సంప్రదాయ మిఠాయి ఉత్పత్తుల ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి సాధించింది. 2015–16లో 197 మిలియన్‌ డాలర్ల విలువైన బెల్లం ఎగుమతులు నమోదు కాగా, 2024–25 నాటికి 406.8 మిలియన్‌ డాలర్లకు చేరింది. దాదాపు 106 శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఎగుమతి పరిమాణం కూడా 292.8 మెట్రిక్‌ టన్నుల నుంచి 471.9 మెట్రిక్‌ టన్నులకు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. ఇండోనేసియా, అమెరికా, యూఏఈ, నైజీరియా, నేపాల్‌ వంటి దేశాలు భారత బెల్లానికి ప్రధాన మార్కెట్లుగా మారాయి. సహజ స్వీటెనర్లకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ భారత్‌కు కొత్త అవకాశాలను తెరుస్తోంది. 

రైతులకు లాభదాయకం
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాకు చెందిన రైతు ఆంతోని సామి సేంద్రియ బెల్లం పొడి తయారీలో విజయం సాధించి ఆదర్శంగా నిలిచారు. సాధారణ బెల్లం కిలో రూ.50కు అమ్ముడవుతుండగా, సేంద్రియ బెల్లం పొడిని రూ.75 వరకు విక్రయిస్తున్నారు. ఉత్పత్తి వ్యయం మాత్రం రెండింటికీ దాదాపు సమానమే. ఇప్పుడు బెల్లం చాక్లెట్లు, కొబ్బరి రుచుల బెల్లం వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి రావడం రైతులకు మరింత ఆదాయాన్ని తెస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
బెల్లం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సంపద యోజన, పీఎం–ఎఫ్‌ఎంఈ, ఓడీఓపీ వంటి పథకాల ద్వారా చిన్న ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లకు ఆర్థిక సాయం అందిస్తోంది. పీఎం–ఎఫ్‌ఎంఈ పథకం కింద దేశవ్యాప్తంగా 3,528 బెల్లం ఆధారిత సూక్ష్మ ఆహార పరిశ్రమలకు రూ.102 కోట్లకు పైగా సబ్సిడీలు మంజూరు చేసింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తులను 19 జిల్లాల్లో ‘వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌’గా గుర్తింపుపొందింది.

జీఐ ట్యాగ్‌తో ప్రత్యేక గుర్తింపు
భారత్‌లో పలు ప్రాంతీయ బెల్లం రకాలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లభించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ బెల్లం, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ గుర్, కేరళలోని మరయూర్‌ బెల్లం ప్రత్యేకతతో గుర్తింపు పొందాయి. ఇవి ప్రాంతీయ సంప్రదాయ తయారీ విధానాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement