
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. 2018-2019 సంవత్సరానికి గానూ రూ.199.5 కోట్ల ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ కాంగ్రెస్ విజ్ఞప్తిని తిరస్కరించింది. పన్ను మినహాయింపు ఇవ్వడం అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 13ఏను ఉల్లంఘించినట్లే అవుతుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు అందుకు గల కారణాల్ని ఇన్‌కమ్ ట్యాక్స్ ట్రిబ్యూనల్ ప్రస్తావించింది. కాంగ్రెస్ పార్టీ తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను 2019 ఫిబ్రవరి 2న ఫైలింగ్ చేసింది. ఇది 2018 డిసెంబర్ 31 చివరి తేదీ లోపు చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 139(1) ప్రకారం డ్యూ డేట్ కింద రాకపోవడం వల్ల, సెక్షన్ 13A ప్రకారం మినహాయింపు పొందలేకపోయింది.
దీనికి తోడు పార్టీ ఇన్ కమ్ ట్యాక్స్ నియమాలకు విరుద్ధంగా నగదు విరాళాలు సేకరించింది. పార్టీ సేకరించిన రూ.14.49 లక్షల నగదులో విరాళాలు అందించిన దాత రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో సమర్పించారు. తద్వారా సెక్షన్ 13A(డీ) నిబంధనలను ఉల్లంఘించింది.
రాజకీయ పార్టీలు మినహాయింపులు పొందాలంటే కఠినమైన నిబంధనలు పాటించాలి. చారిటబుల్ ట్రస్టులుకి ఉన్న వెసులుబాటు రాజకీయ పార్టీలకు వర్తించదు. దీంతో తాజా ట్యాక్స్ ట్రిబ్యూనల్ నిర్ణయం కాంగ్రెస్‌కు ఎదుదెబ్బ తగిలినట్లైంది.