విక్రమ్‌–ఎస్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం

India first privately developed rocket Vikram-S set for launch on nov 18 2022 - Sakshi

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్‌ రంగానికి నాంది పలుకుతూ ప్రైవేట్‌రంగంలో రూపొందిన తొలి రాకెట్‌ విక్రమ్‌–ఎస్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లోని సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగవేదిక నుంచి నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ రూపొందించిన ఈ రాకెట్‌కు అంతరిక్ష ప్రయోగాలకు ఆధ్యులైన డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ పేరిట విక్రమ్‌–ఎస్‌ అని నామకరణం చేశారు.

ప్రైవేట్‌రంగంలో తొలి రాకెట్‌ కావడంతో దీనిని ప్రారంభ్‌ అని కూడా పిలుస్తున్నారు. ఈ రాకెట్‌ మూడు అతిచిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఈ పేలోడ్స్‌ రోదసీలో భూమికి అతి తక్కువ దూరం అంటే 81 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉండి వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన విక్రమ్‌–ఎస్‌ రాకెట్‌ మొత్తం బరువు 545 కేజీలు. ఎత్తు ఆరు మీటర్లు. ఇది 83 కేజీల మూడు పేలోడ్స్‌ను నింగిలోకి మోసుకెళ్లనుంది.

ఘన ఇంధనంతో కూడిన సింగిల్‌ స్టేజ్‌ రాకెట్‌ కావడం దీని ప్రత్యేకత. ఈ రాకెట్‌ ద్వారా స్పేస్‌కిడ్జ్‌ అనే ఏరోస్పేస్‌ స్టార్టప్‌ సంస్థకు చెందిన 2.5 కేజీల ఫన్‌–శాట్‌ను కక్ష్యలోకి పంపుతున్నారు. దీనిని ఐఐటీ విద్యార్థులు, అమెరికా, సింగపూర్, ఇండోనేసియా విద్యార్థులు సంయుక్తంగా తయారుచేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్‌–స్పేస్‌ టెక్, ఆర్మేనియాకు చెందిన బజూమ్‌క్యూ స్పేస్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌కు చెందిన పేలోడ్లను రాకెట్‌ మోసుకెళ్లనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top