యువ సింగర్ ఇందర్ కౌర్ హఠాన్మరణం పంజాబ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. వారం కిందట కిడ్నాప్‌కు గురైన ఆమె.. నిన్న కాలువలో శవమై కనిపించారు. దీంతో అక్కడి సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ కేసులో విస్తుపోయే విషయాల్ని వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు.
యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్(29).. పంజాబీ సింగింగ్ సెన్సేషన్. ఈ నెల 13న సాయంత్రం లూథియానాలోని ఇంటి నుంచి కారులో బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చుట్టుపక్కల అంతటా జల్లెడ పట్టారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో.. మంగళవారం సాయంత్రం నీలో కాలువలో ఆమె శవంగా తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు కబురు పంపి.. మృతదేహాన్ని సమ్రాలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే వివరాలు చెబుతామని అధికారులు అంటున్నారు. ఈలోపు ఇందర్ కుటుంబం సంచలన ఆరోపణలకు దిగింది.
మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన గాయకుడు సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా ఇందర్ మృతికి కారణమంటూ ఆమె సోదరుడు జోతింధర్ సింగ్ చెబుతున్నాడు. మూడేళ్ల కిందట వీళ్లకు పరిచయమైంది. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేశాడు సుఖా. అయితే అప్పటికే కెనడాలో అతనికి భార్యాపిల్లలు ఉన్నారు. దీంతో తిరస్కరించింది. దీంతో కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని జోతింధర్ అంటున్నాడు. తమ సోదరి కనిపించకుండా పోయిన నాడే పోలీసులకు ఈ విషయం చెప్పామని అంటున్నాడతను. సుఖాతో పాటు అతని స్నేహితుడు కరమ్‌జిత్ సింగ్ కూడా ఈ నేరంలో భాగమయ్యాడు. వాళ్లు తుపాకీ చూపించి ఇందర్‌ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతే ఆమె శవమై కనిపించిందని ఆరోపిస్తోంది ఆమె కుటుంబం.

పోలీసుల అలసత్వమేనా?
ఇందర్ కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు, తండ్రి మే 13వ తేదీ రాత్రే లూథియానాలోని జమల్పూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు వెంటనే స్పందించలేదన్నది ఇందర్ కుటుంబం చేస్తున్న ఆరోపణ. ఉన్నతాధికారి లేడంటూ ఆ మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఎదురు చూశారు. ఆ తర్వాతే ఫిర్యాదు తీసుకుని ఆమె కోసం గాలింపు చేపట్టారు. పైగా అనుమానితుడిగా సింగర్ సుఖా పేరు చెప్పినా.. ఆ కోణంలో దర్యాప్తు జరపలేదు.
ఇందర్ తిరస్కరించాక సుఖా అవమానంగా ఫీలై కెనడాకు వెళ్లిపోయాడు. అయితే పగ పెంచుకుని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఇందర్, ఆమె కుటుంబం ఊహించలేదు. కెనడా నుంచి నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చిన సుఖా.. నేరం చేశాక తిరిగి అదే దారిలో వెళ్లిపోయాడు. పోలీసులు తక్షణ ఫిర్యాదు స్వీకరించినా.. సకాలంలో స్పందించినా.. ఇందర్ ప్రాణాలు దక్కేవని, నేరస్తుడు చిక్కేవాడేమోనని అని బాధిత కుటుంబం వాపోతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విచారణకు ఆదేశిస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత విబేధాలతో పాటు గ్యాంగ్‌స్టర్ మాఫియా లింకుల కోణంలోనూ ఈ కేసు విచారణ జరుపుతామని ప్రకటించింది.

ఫేమస్ అవుతున్న టైంలో..
పంజాబీ సంగీత ప్రపంచంలో ఇందర్ కౌర్ రైజింగ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఫోక్ మ్యూజిక్‌కి దగ్గరగా ఉండే స్టైల్‌తో పాటు పాప్ కల్చర్‌కి కూడా అనుసంధానం చేసేది. లైవ్ పెర్ఫార్మెన్స్‌లు, సోషల్ మీడియా ప్రెజెన్స్ వల్ల ఆమెకు మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అలా అభిమానులు ఆమెను ఫోక్ క్వీన్‌గా పిలుచుకునేవారు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె హఠాత్తుగా ఇలా చనిపోవడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.
పంజాబ్‌లోనే ఎందుకిలా?
ఇందర్ కౌర్ మరణం పంజాబ్ గ్లామర్‌ఫీల్డ్‌ను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. వ్యక్తిగత విబేధాలు మాత్రమే కాదు.. అక్కడి గాయకులు, సెలబ్రిటీలు తరచుగా హింసకు గురవుతున్నారు. సిధూ మూసేవాలా, అమర్ సింగ్ చమ్కిలా వంటి ప్రముఖులు కూడా ఈ తరహా దాడుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అందుకు కారణాలను పరిశీలిస్తే..
పంజాబ్‌లో సింగర్లు కేవలం వినోదకారులు మాత్రమే కాదు.. సామాజిక, రాజకీయ, కుల చిహ్నాలుగా ఉంటున్నారు. వీటికి తోడు పంజాబ్‌లో సంఘటిత నేరజాలం వినోద రంగంతో మిళితమై ఉంది. అంటే.. కొంతమంది గాయకుల పాటల్లో గన్స్, రివెంజ్, పవర్ పాలిటిక్స్ వంటి అంశాలు ఉండటం వల్ల వారు గ్యాంగ్‌స్టర్ కల్చర్‌తో అనుసంధానమైపోతున్నారు. అలా దాడులకు గురవుతూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.


