Income Tax Raids On BBC Delhi Office Phones Seized - Sakshi
Sakshi News home page

బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్‌!

Published Tue, Feb 14 2023 1:02 PM

Income Tax Raids On BBC Delhi Office Phones Seized - Sakshi

న్యూఢిల్లీ: బీబీసీ–మోదీ డాక్యుమెంటరీ వివాదం కొత్త మలుపు తిరిగింది. పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ మంగళవారం ‘సర్వే’ జరిపింది! ఇవి దాడులు కావని, బీబీసీ సబ్సిడరీ కంపెనీలకు చెందిన అంతర్జాతీయ పన్ను విధానాలు తదితరాలకు సంబంధించిన సర్వే మాత్రమేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ఈ అవకతవకలపై బీబీసీకి గతంలోనే నోటీసులిచ్చినా బేఖాతరు చేసింది. పైగా భారీగా లాభాలను దారి మళ్లించింది’’ అని ఆరోపించాయి.

ఐటీ అధికారులు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలో కస్తూర్బా గాంధీ మార్గ్, ముంబైలోని శాంతాక్రుజ్‌ ప్రాంతంలో ఉన్న బీబీసీ కార్యాలయాలకు చేరుకున్నారు. సర్వే పూర్తయ్యేదాకా బీబీసీ సిబ్బందిని కార్యాలయ ఆవరణ వీడేందుకు అనుమతించలేదు. వారినుంచి సెల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్టు అనంతరం బీబీసీ ట్వీట్‌ చేసింది. గుజరాత్‌లో గోద్రా అనంతర అల్లర్లకు అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీయే నేరుగా బాధ్యుడంటూ జనవరిలో బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ పెను వివాదానికి దారి తీయడం, దాన్ని కేంద్రం నిషేధించడం తెలిసిందే.

మండిపడ్డ విపక్షాలు
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సర్వేలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. మోదీ ప్రభుత్వం నిత్యం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ఇది కచ్చితంగా బెదిరింపు చర్యేనని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయంటూ ధ్వజమెత్తారు. కేంద్రం తీరు నియంతృత్వానికి పరాకాష్ట అని సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ దుయ్యబట్టాయి.

కేంద్ర దర్యాప్తు సంస్థలు ‘ప్రేమికుల రోజు సర్వే’లకు దిగాయంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఎద్దేవా చేశారు. ‘‘ఇదే ఊపులో ఐటీ, సెబీ, ఈడీ తదితరాలన్నీ కలసి కేంద్రానికి అత్యంత ప్రియుడైన మిస్టర్‌ ఎ సంస్థలపైనా ఇలాంటి సర్వేలు చేస్తే ఎలా ఉంటుంది!’’ అని అదానీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వేలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. పాలక వర్గం పట్ల విమర్శనాత్మకంగా ఉండే మీడియా సంస్థలను వేధించే ధోరణికి ఇది కొనసాగింపని ఒక ప్రకటనలో విమర్శించింది.

నిశితంగా గమనిస్తున్నాం: బ్రిటన్‌
తాజా పరిణామాలు బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సర్వేకు బీబీసీ డాక్యుమెంటరీతో సంబంధముందన్న భావన బ్రిటన్‌ ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారికంగా స్పందించకపోయినా, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు అవి పేర్కొన్నాయి. ఇవి కచ్చితంగా కక్షసాధింపు ధోరణితో కూడిన వేధింపు చర్యలేనని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ లీడింగ్‌ ఆథర్‌ డాక్టర్‌ ముకులికా బెనర్జీతో పాటు బ్రిటన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ సౌత్‌ ఏషియా సాలిడారిటీ గ్రూప్‌ కూడా విమర్శించింది. వీటిని తక్షణం ఆపాలని డిమాండ్‌ చేసింది. అయితే, వార్తా సంస్థ ముసుగులో సామ్రాజ్యవాదులతో చేతులు కలిపిన బీబీసీ భారత్‌లో కచ్చితంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని గ్లోబల్‌ హిందూ ఫెడరేషన్‌ చైర్‌పర్సన్‌ సతీశ్‌ శర్మ ఆరోపించారు.

కాంగ్రెస్ రియాక్షన్..
బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెటంరీ కమిటీ(జేపీసీ) వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేశ్ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

చదవండి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పోటీయే లేదు: అమిత్ షా

Advertisement
 
Advertisement
 
Advertisement