సాక్షి, విశాఖపట్నం: అండమాన్ తీరాన్ని రుతు పవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు పయనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మొత్తం నికోబార్ దీవులు, శ్రీవిజయపురం (బ్లెయిర్ పోర్ట్) సహా అండమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందే.. అంటే మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న (శుక్రవారం) తెలిపిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఇది భారతదేశంలో నైరుతి రుతుపవనాల కాలం (జూన్ నుండి సెప్టెంబర్) ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. ఈ సీజన్‌లో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని.. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది.


