ఏప్రిల్‌–జూన్‌లో వేడి సెగలు! | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌–జూన్‌లో వేడి సెగలు!

Published Sun, Apr 2 2023 5:16 AM

IMD predicts above-normal temperatures in most of India from April to June  - Sakshi

న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్‌ రోజులు కొనసాగవచ్చు.

దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్‌లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు.

భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది.

భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్‌ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్‌ నినో ఉండబోతోందని అర్థం. ఎల్‌ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్‌లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్‌ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement
Advertisement