ఐవీఎఫ్ పేరుతో కొంతమంది వైద్యుల ఆగడాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కేసు సంచలనం రేపుతోంది. తమకు పుట్టిన పిల్లల డీఎన్‌ఏ మ్యాచ్ కాకపోవడంతో గురుగ్రామ్‌కు చెందిన దంపతులు లబోదిబో మన్న వైనం వెలుగులోకి వచ్చింది.
గురుగ్రామ్‌కు చెందిన రాహుల్ రాథోడ్, అతని భార్య మీనూ రాథోడ్ సంతానంకోసం గత ఏడాది ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిని ఎంచుకున్నారు. జనవరిలో మీనూ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు తమ పోలికలతో అస్సలు సరిపోలకపోవడంతో అనుమానం వచ్చి, పిల్లల డీఎన్‌ఏ (DNA) పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్స్‌లో వారు షాకయ్యే నిజం తెలియడంతో పిల్లలు పుట్టారన్న సంతోషం కాస్తా పీడకలగా మారిపోయింది.
మరొక జంటకు చెందిన పిండాన్ని (embryo) మీనూ రాథోడ్ గర్భాశయంలో ప్రవేశపెట్టారని ఆరోపిస్తూ భర్త పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఆరోపణపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఢిల్లీ కోర్టు స్థానిక పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?
दिल्ली में IVF से जन्मे जुड़वां बच्चों का DNA माता-पिता से नहीं हुआ मैच, FIR दर्ज #Delhi | @PallavMishra11 pic.twitter.com/sxyWJZSH5T
— NDTV India (@ndtvindia) June 14, 2026
ఏం జరిగింది?
ద్వారకాలోని ఒక ఆసుపత్రి తమను ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో ఉన్న ఒక ఇన్‌ఫెర్టిలిటీ (సంతానలేమి) క్లినిక్‌కు ఐవీఎఫ్ చికిత్స కోసం పంపిందని, అక్కడ డాక్టర్ శివానీ సచ్‌దేవ్ ఈ కేసును పర్యవేక్షించారని రాహుల్ రాథోడ్ తెలిపారు. గత ఏడాది జనవరి 9న వైద్యులు ఆ మహిళకు ఐవీఎఫ్ సంబంధిత పరీక్షలు నిర్వహించి, భర్త వీర్యం, అండం ఉపయోగించే పిండాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అలా అభివృద్ధి చేశామని చెప్పిన పిండాన్ని మే 14న మీనూ గర్భాశయంలో ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 5న ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే ట్విన్స్ పోలీకలపై అనుమానంతో టెస్ట్ చేయించారు. చివరికి వారు అనుమానించినట్టుగానే ఆ పిల్లలు బయోలాజికల్‌గా వారిద్దరికీ పుట్టినవారు కాదని ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్‌లో తేలింది. దీంతో క్లినిక్ వాళ్లే ఏదో మాయ చేశారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రాహుల్ రాథోడ్ డిమాండ్ చేశారు. దర్యాప్తు కోసం ఆసుపత్రిలోని ఐవీఎఫ్ రికార్డులు, పిండానికి సంబంధించిన పత్రాలు, ల్యాబ్ రికార్డులు, ఎలక్ట్రానిక్ డేటా, సీసీటీవీ (CCTV) ఫుటేజీలను భద్రపరచాలని ఆయన కోరారు. తమలాగే ఐవీఎఫ్ క్లినిక్‌ల వల్ల మోసపోయిన పలు దేశాలలోని దంపతులనుండి తనకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీనూ రాథోడ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి!


