వెండి దిగుమతులపై ఆంక్షలు | Government imposes immediate import restrictions on silver | Sakshi
Sakshi News home page

వెండి దిగుమతులపై ఆంక్షలు

May 17 2026 5:28 AM | Updated on May 17 2026 5:28 AM

Government imposes immediate import restrictions on silver

‘రిస్ట్రిక్టెడ్‌’ విభాగంలోకి మార్చిన ప్రభుత్వం

దీంతో ఇకపై దిగుమతులకు డీజీఎఫ్‌టీ అనుమతి తప్పనిసరి

కడ్డీలు, ఆభరణాలు మొదలైన వాటికి వర్తింపు

అనుమతి తీసుకున్నా గరిష్టంగా 100 కేజీలకే పరిమితం.. సెజ్‌లు, ఎగుమతి ఆధారిత కంపెనీలకు మాత్రం మినహాయింపు

తాజా నియంత్రణలతో రేట్లకు రెక్కలు 

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌: పశ్చిమాసియా సంక్షోభం వేళ విదేశీ మారక (డాలర్ల) నిల్వలను కాపాడుకునే క్రమంలో దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పసిడి, వెండి, ప్లాటినంలపై సుంకాలను పెంచిన ప్రభుత్వం వెండికి సంబంధించి మరిన్ని నియంత్రణలను ప్రకటించింది. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే (ఫ్రీ ఇంపోర్ట్‌) కేటగిరీలో ఉన్న వెండిని ఆంక్షలు వర్తించే ‘రిస్ట్రిక్టెడ్‌’ కేటగిరీలోకి మార్చింది. దీనితో ఈ విభాగంలోని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలంటే ప్రభు­త్వం నుంచి లైసెన్సు అవసరం ఉంటుంది. తాజా పరిణామంతో ఇకపై 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి కడ్డీలు, సెమీప్రాసెస్డ్‌ సిల్వర్, సిల్వర్‌ పౌడర్, సాదా వెండి ఆభరణాల్లాంటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల­న్నా డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) నుంచి ప్రత్యేక అను­మ­తులు అవసరమవుతాయి.

అయితే, 100 శాతం ఎగుమతి ఆధారిత యూ­­నిట్లు (ఈవోయూ), ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌)లోని యూనిట్లకు ఈ ఆంక్షలు వర్తించవు. కాకపోతే, అవి దిగుమతి చేసుకున్న వాటిని భారత మార్కెట్లో విక్రయించకుండా, పూర్తిగా ఎగుమతి మాత్రమే చేయాల్సి ఉంటుంది. పైపెచ్చు ముందస్తు అనుమతి తీసుకున్నా సరే... ఒకసారి 100 కిలోలకన్నా ఎక్కువ పరిమాణంలో దిగుమతి చేసుకోవటా­నికి అనుమతించరు. ఇక ఎగుమతి ఆధారిత యూనిట్లు తొలుత దిగుమతి చేసుకున్న వెండిని వినియోగించి... అందులో కనీసం 50 శాతాన్ని ఎగుమతి చేసినట్లు నిరూపిస్తేనే మరోసారి దిగుమతికి అనుమతిస్తారు. విలువైన లోహాల దిగుమతి కోసం విదేశీ మారక నిల్వలను భారీగా వెచ్చించాల్సి వస్తుండటంతో పసిడితో పాటు వెండి దిగుమతులపై కేంద్రం సుంకాలను ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

12 బిలియన్‌ డాలర్ల దిగుమతులు
భారత దిగుమతుల్లో వెండి వాటా ఏడాదికి దాదాపు 7 వేల నుంచి 9 వేల టన్నుల వరకు ఉంటోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2025– 26లో వెండి దిగుమతులు పరి­మాణం పరంగా 42 శాతం పెరిగి 7,335 టన్నులకు చేరాయి. విలువపరంగా 150 శాతం పెరిగి 12 బిలియన్‌ డాలర్లకు ఎగి­శా­యి. అంతర్జాతీయంగా ధరలు పెరగడమే ఇందు­కు కారణం. దిగు­మతి చేసుకునే వాటిల్లో ప్రధానంగా సిల్వర్‌ పౌడర్, బులియన్‌ కడ్డీలు, ముడి రూపంలోని వెండి ఉంటున్నాయి. కొత్త నిబంధనలతో వెండి దిగుమతుల్లో సింహభాగానికి డీజీఎఫ్‌టీ అనుమతి తప్పనిసరి కానుంది. 

ఎందుకీ నిర్ణయాలు
కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట పరిస్థితుల్లో అత్యంత విలువైన ఫారెక్స్‌ నిల్వలను కాపాడుకోవడం అందులో ఒకటి. అలాగే వివిధ దేశాలతో పెరిగిపోతున్న వాణిజ్య లోటును నియంత్రించడం మరో లక్ష్యం. థాయ్‌లాండ్, యూఏఈలాంటి దేశాలతో భారత్‌కి స్వేచ్ఛా వాణి­జ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) ఉన్నాయి. దీనితో సుంకాల భారం భారీగా ఉండకుండా, ఆయా దేశాల మార్గం గుండా దిగుమతి చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కనుక, ఎఫ్‌టీఏల దుర్వినియోగాన్ని అడ్డుకో­వడానికి కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

సాధారణ ప్రజలపై ప్రభావం ఏంటంటే..
ఆభరణాలు ప్రియం..: అంతర్జాతీయంగా వెండి ధరలు భారీ స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఇటీవలి సుంకాల విధింపుతో సిల్వర్‌ ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. దీనికి తోడు ఇక సంక్లిష్టమైన లైసెన్సు ప్రక్రియ కూడా తోడైతే దిగుమతుల్లో జాప్యానికి దారి తీయొచ్చు. ఫలితంగా దేశీయంగా డిమాండ్, అలాగే ధరలు కూడా భారీగా ఎగిసే అవకాశం ఉంది. మన దగ్గర శుభకార్యాలు, ఇతరత్రా గిఫ్ట్‌ ఐటెమ్స్‌లో వెండి వినియోగం ఎక్కువే ఉంటోంది. అయితే, చిన్న వ్యాపారులు, ఆభరణాల తయారీదార్లకు ముడి వస్తువు వ్యయాలు పెరుగుతాయి కాబట్టి ఆ మేరకు వాటి రేట్లు కూడా పెరిగిపోతాయి. 

స్మగ్లింగ్‌ ముప్పు..: దిగుమతి సుంకాలను పెంచినప్పుడే స్మగ్లింగ్‌ ముప్పులపై ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు మరిన్ని నియంత్రణల వల్ల ఈ రిస్కులు ఇంకా పెరుగుతాయని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. 

పరిశ్రమలకు షాక్‌..: కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా ఇతరత్రా పారిశ్రామిక అవసరాలకు కూడా వెండి వినియోగం గణనీయంగా పెరిగింది. సోలార్‌ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ పరికరాలు .. ఇలా ఒకటేమిటి, అనేక అవసరాల కోసం సిల్వర్‌ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. తాజా నియంత్రణల వల్ల ఆయా పరిశ్రమలకు ముడి వస్తువు ఖర్చులు పెరిగిపోతాయి. ఫలితంగా అవి తయారు చేసే ఉత్పత్తుల ధరలూ పెరుగుతాయి. 

పెట్టుబడులకు కొనసాగనున్న ఆసక్తి..
పసిడితో పాటు ఇన్వెస్టర్లు ఇప్పుడు వెండిని కూడా ఓ కీలకమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు. బంగారంతో పోలిస్తే అందుబాటు స్థాయిలో ఉండటంతో రేట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నా సిల్వర్‌వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ల కోణంలో దీనికి డిమాండ్‌ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement