G20 Summit: అతిథులొస్తున్నారు...

G20 Summit: joe Biden, Rishi Sunak and other leaders arrive in Delhi On 8 Septmber 2023 - Sakshi

అద్భుత ఆతిథ్యానికి సిద్ధమైన భారత్‌..

నేడు భారత్‌కు ప్రపంచ దేశాధినేతల ఆగమనం..

ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మొదలు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా!

► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు
బ్రిటన్‌ :: రిషి సునాక్‌
జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్‌కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్‌. భారతీయ మూలాలున్న బ్రిటన్‌ ప్రధాని అయిన సునాక్‌ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్‌ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్‌ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్‌ శ్లాఘించారు.

జపాన్‌ :: ఫుమియో కిషిదా
సునాక్‌ విమానం ల్యాండ్‌ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్‌ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌదరి రిసీవ్‌ చేసుకోనున్నారు. కిషిదా భారత్‌కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్‌లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

అమెరికా :: జో బైడెన్‌
అగ్రరాజ్యాధినేత జో బైడెన్‌ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్‌(రిటైర్డ్‌) వీకే సింగ్‌ బైడెన్‌కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్‌ సతీమణి జిల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో బైడెన్‌ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్‌కు చేసిన కరోనా టెస్ట్‌లో నెగటివ్‌ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్‌ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.  
 
కెనడా :: జస్టిన్‌ ట్రూడో
అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో భారత్‌లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ జస్టిన్‌కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్‌ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్‌ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్‌లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
 
చైనా :: లీ కియాంగ్‌  
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్‌ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్‌పింగ్‌ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్, అకాŠస్‌య్‌ చిన్‌ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్‌ మీద భారత్‌ ఆగ్రహంగా ఉంది.
 
జర్మనీ, ఫ్రాన్స్‌ల నేతలూ..
యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్‌ ప్రధాని లూంగ్‌ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్‌ రిసీవ్‌ చేసుకుంటారు.  జర్మనీ చాన్స్‌లర్‌ స్కోల్జ్‌ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ రిసీవ్‌ చేసుకోనున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్‌ పాటిల్‌ మేక్రాన్‌కు స్వాగతం పలుకుతారు.  

క్యూ కట్టనున్న నేతలు
సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్‌ ఇయోల్‌ యూన్‌ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్‌ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్‌ అధ్యక్షుడు పెట్రో పెరిజ్‌ రాత్రి 10.15కు చేరుకుంటారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top