Largest Banknotes: మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా​..?

Four Very Large Banknotes From Around the World - Sakshi

బడ్జెట్‌ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? 

స్టాంపు కాదు డబ్బులే.. 
ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ.
ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. 

చదవండి: (బడ్జెట్‌ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) 

సర్టిఫికెట్‌ సైజులో లక్ష నోటు...
ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్‌ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్‌కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్‌ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది.
ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. 

కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు
మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్‌ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్‌ బిలియన్‌)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 
2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్‌ ట్రిలియన్‌) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. 

పోకెమాన్‌.. డాలర్‌ మిక్కీమౌస్‌.. 2 డాలర్లు
సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్‌వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్‌ వంటి యానిమేటెడ్‌ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్‌ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్‌ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. 


‘నియూ డాలర్స్‌’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top