
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్(81) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈయన తనయుడు.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. అనంతరం జార్ఖండ్‌కు ఆయన మూడుసార్లు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కీలకంగా పని చేయడంతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. చిరుదిహ్ హత్య కేసు శిబు సోరెన్ రాజకీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్‌గా మారింది. 2004లో, శిబు సోరెన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న టైంలో.. చిరుదిహ్ గ్రామంలో తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కారణంగా ఆయన జూలై 24, 2004న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఒక నెల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. సెప్టెంబర్ 8న బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. చివరికి శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

