గృహ నిర్బంధంలోకి ముఫ్తీ

Former JK CM Mehbooba Once Again Under House Arrest - Sakshi

శ్రీనగర్: ఉగ్రవాద కేసులో అరెస్టయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వహీద్‌ పర్రా కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినివ్వడం లేదని పీడీపీ నాయకురాలు, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. "చట్టవిరుద్ధంగా నన్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నా కుమార్తె ఇల్టిజాను గృహ నిర్బంధంలో ఉంచారు" అని తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉన్న వహీద్ పర్రాను బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. వహీద్ పర్రా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. ఈ సందర్బంగా ముఫ్తీ పుల్వామాలోని వాహిద్ కుటుంబాన్ని సందర్శించడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు.

కాగా.. బీజేపీ మంత్రులు వారి సహాచరులు రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరగడానికి అనుమతి ఉంది కానీ మేము వెళ్లాలంటే భద్రత సమస్య ఉందంటూ సాకులు చెప్తున్నారని ముఫ్తీ శుక్రవారం ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. తన ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం ఫోటోను కూడా జత పోస్ట్‌ చేశారు. దక్షిణ కశ్మీర్‌లో ముఖ్యంగా ఉగ్రవాద బారినపడిన పుల్వామాలో పీడీపీ పునరుద్ధరణలో వహీద్ పర్రా కీలక పాత్ర పోషించారు. అక్కడి జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరుగనున్నాయి.

అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో తీసుకెళ్తుండగా అరెస్టయిన డీఎస్పీ డేవిందర్ సింగ్ కేసు దర్యాప్తులో వహీద్ పర్రా పేరు బయటపడింది. నిరాధార ఆరోపణలపై వహీద్ పర్రాను అరెస్టు చేశారన్నారు. ముఫ్తీ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుని అక్టోబర్‌లో విడుదల చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top