
న్యూఢిల్లీ: దేశంలో మొట్టమొదటిసారిగా అమెరికా యూనివర్సిటీ ఒకటి క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. షికాగోలోని ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ముంబైలో ఏర్పాటయ్యే ఈ క్యాంపస్ 2026 నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ వంటి డిమాండున్న విభాగాల్లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించనుంది.
షికాగో యూనివర్సిటీ క్యాంపస్‌లో మాదిరిగానే విద్యాపరంగా కఠినమైన, అనుభవ పూర్వక, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలను బోధిస్తామని ఇలినాయీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రెసిడెంట్ రాజ్ ఎచంబడి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంపిక చేసే బోధనాసిబ్బంది, ఇలినాయీ టెక్ (Illinois Tech) అమెరికా క్యాంపస్‌ల నుంచి విజిటింగ్ ప్రొఫెసర్లు కూడా ఉంటారన్నారు.
కాగా, యూకేకు చెందిన సౌతాంప్టన్ యూనివర్సిటీ (southampton university) ఈ ఏడాదిలోనే భారత్‌లో క్యాంపస్ (Campus) ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్, వొల్లొన్‌గాంగ్ వర్సిటీలు ఇప్పటికే గుజరాత్‌లో పనిచేస్తున్నాయి.
సైన్యానికి పార్లమెంటరీ కమిటీల అభినందనలు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌తోపాటు పీవోకేలో ఉగ్ర లక్ష్యాలపై దాడులు చేపట్టిన మన బలగాలను పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్(పీఏసీ) అభినందనలు తెలిపింది. 2025–26కు గాను కొత్తగా ఏర్పాటైన కమిటీ మొట్టమొదటి భేటీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానం ఆమోదించినట్లు కమిటీ చైర్ పర్సన్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఇదేవిధమైన తీర్మానాన్ని ఆమోదించింది.
చదవండి: కల్నల్ సోఫియా ఖురేషీని చూసి కూడానా..