
సైన్యంలో మహిళల శాశ్వత నియామకాలపై 2020లో సుప్రీం కీలక తీర్పు
సోఫియా ఖురేషీ ట్రాక్ రికార్డునే ఉదాహరణగా చూపిన న్యాయస్థానం
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల అణచివేతకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరు దేశంలో ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చిందో.. ఆ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న మహిళా సైనికాధికారులు సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ పేర్లు కూడా అంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ముఖ్యంగా కల్నల్ సోఫియా ఖురేషీ గొప్పతనం గురించి ఐదేళ్ల క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. సైన్యంలో మహిళా అధికారుల శాశ్వత నియామకానికి (పర్మనెంట్ కమిషన్) సంబంధించిన కేసులో ఈమె ట్రాక్ రికార్డును న్యాయస్థానం ఉదాహరణగా చూపటం విశేషం.
ఆడవాళ్లన్న కారణంతో సైన్యంలో పర్మనెంట్ కమిషన్ (పీసీ)కు అనర్హులుగా నిర్ధారించటం చట్టవ్యతిరేకమని 2020 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. ఆ కేసులో మహిళల పీసీకి వ్యతిరేకంగా సైన్యం, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లపై నాడు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 పేరుతో భారతదేశం నిర్వహించిన అతిపెద్ద అంతర్జాతీయ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో భారత కంటింజెంట్‌కు న్యాయకత్వం వహించిన మొదటి మహిళ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).
2006లోనే ఆమె కాంగోలో ఐక్యరాజ్యసమితి (United Nations) శాంతి పరిరక్షక దళంలో సేవలందించారు. ఆ సమయంలో కాల్పుల విరమణకు అక్కడి దేశాలను ఒప్పించటంతోపాటు మానవతా సాయంలో కూడా ఆమె కీలకపాత్ర పోషించారు. తన శక్తియుక్తులతో అక్కడ శాంతి సాధనకు కృషిచేశారు. సైన్యంలో పురుషులతోపాటు భుజంభుజం కలిపి పనిచేస్తున్న మహిళలకు.. వారి శరీర నిర్మాణాన్ని సాకుగా చూపి పీసీకి అనర్హులుగా ప్రకటించటం సరికాదు’ అని సుప్రీంకోర్టు నాటి తీర్పులో పేర్కొంది.