
ఢిల్లీ: భారత సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు కూడా నమోదైంది. అనంతరం, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మంత్రి తీరును తప్పుపట్టింది. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అని సూచనలు చేసింది.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కల్నల్ ఖురేషీపై మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు చేశారు. ఖురేషీని ఉద్దేశిస్తూ ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఉగ్రవాదులను హతమర్చేందుకు ఆమె పాకిస్తాన్ వెళ్లారని విజయ్ షా అన్నారు. దీంతో, సదరు మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు బుధవారం సుమోటోగా తీసుకుంది. శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని జస్టిస్ అతుల్ శ్రీధరణ్, జస్టిస్ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తమకు నివేదించాలని రాష్ట్ర డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతరం, హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. అంతేగాకుండా ఆయన తీరును తప్పుపట్టింది. ‘ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ముందు వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి. ఇలాంటి అంశాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి’ అని ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు.. అటు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.
On the shameful statement of BJP minister Vijay Shah by referring to Colonel Sofia as Sister of Terrorists, The division bench of Jabalpur High Court has suo motu directed to register a case against Vijay Shah under serious criminal sections. Via : @sanjaygupta1304 pic.twitter.com/guS2ihv4hb
— Mohammed Zubair (@zoo_bear) May 14, 2025