ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు

Farmer Union Decides to Bharat Bandh Today - Sakshi

వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో రైతుల పిలుపు

ప్రధాన విపక్షాలు, కార్మిక సంఘాల మద్దతు

శాంతి, భద్రతలు జాగ్రత్త; రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు భారత్‌ బంద్‌ జరగనుంది. ఈ దేశవ్యాప్త నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, టీఎంసీ, వామపక్షాలు, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఆర్‌ఎస్‌ సహా దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీల కార్యకర్తలు బంద్‌లో చురుగ్గా పాలుపంచుకోనున్నారు. బంద్‌లో పాల్గొని, రైతుల న్యాయబద్ధ డిమాండ్లకు మద్దతివ్వాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌ను పాటించాలని ఎవరినీ ఒత్తిడి చేయవద్దని సూచించాయి. శాంతియుతంగా నిరసన తెలపాలని, అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి.

మరోవైపు, రైతులు ప్రకటించిన భారత్‌ బంద్‌నకు నైతిక మద్దతు తెలుపుతున్నామని పది కార్మిక సంఘాల ఐక్య కమిటీ సోమవారం ప్రకటించింది. బంద్‌కు మద్దతు తెలుపుతూనే, కార్మికులు విధుల్లో పాల్గొంటారని పేర్కొంది. డ్యూటీలో ఉండగా నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేస్తారని, విధుల్లోకి వెళ్లేముందు కానీ విధులు ముగిసిన తరువాత కానీ నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని తెలిపింది. కార్మికులు  స్ట్రైక్‌ చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని హిందూ మజ్దూర్‌ సభ ప్రధాన కార్యదర్శి హర్భజన్‌ సింగ్‌ వివరించారు. కాగా, బంద్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది.

ఢిల్లీ–మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు

కోవిడ్‌–19 ముప్పు పొంచి ఉన్న కారణంగా, మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని, శాంతిసామరస్యాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేసింది. రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీలోని పలు సరిహద్దుల వద్ద పోలీసులను భారీగా మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీ సరిహద్దుల్లో గత 12 రోజులుగా నిరసన తెలుపుతున్న రైతులతో కేంద్ర మంత్రులు ఇప్పటివరకు ఐదు విడతలుగా జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసిన విషయం తెలిసిందే.

మరో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. వేలాదిగా రైతులు నిరసన తెలుపుతున్న సింఘు సరిహద్దును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం సందర్శించారు. రైతులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. ‘తాత్కాలిక జైళ్లుగా ఢిల్లీలోని స్టేడియంలను వాడుకునేందుకు అనుమతించాలని మాపై భారీగా ఒత్తిడి వచ్చింది. మేం వారి ఒత్తిడికి తలొగ్గలేదు. అది ఉద్యమానికి సహకరించింది’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. రైతులకు కష్టం కలగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ‘ఒక ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సేవకుడిలా మీ వద్దకు వచ్చాను’ అని రైతులతో పేర్కొన్నారు. ఆప్‌ నేతలు, కార్యకర్తలు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.   

మద్దతివ్వండి
బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని దేశ ప్రజలకు రైతు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్‌లో పాల్గొనేలా ఎవరినీ ఒత్తిడి చేయవద్దని తమ మద్దతుదారులను కోరాయి. శాంతియుతంగా బంద్‌ జరపాలని, హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని భారతీయ కిసాన్‌ ఏక్తా సంఘటన్‌ అధ్యక్షుడు జగ్జిత్‌ సింగ్‌ దాలేవాలా కోరారు. ‘మేం పిలుపునిచ్చిన బంద్‌ రాజకీయ పార్టీలిచ్చే బంద్‌ లాంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతిక లక్ష్యం కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు.. నాలుగు గంటల పాటు జరిపే ప్రతీకాత్మక బంద్‌. ఈ నిరసనతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది మా ప్రధాన ఉద్దేశం. అందుకే ఆ నాలుగు గంటల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం’ అని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయిత్‌ వివరించారు.

ఆ నాలుగు గంటల పాటు దుకాణాలను మూసేయాలని వ్యాపారస్తులను కోరుతున్నామన్నారు. ఆ నాలుగు గంటల పాటు టోల్‌ ప్లాజాలను, కీలక రహదారులను నిర్బంధిస్తామని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతు నేత బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌ స్పష్టం చేశారు. తాజా చట్టాలు రైతులకు లబ్ధి చేకూరుస్తాయని ఇన్నాళ్లు చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి సవరణలు చేసేందుకు సిద్ధమని ఎందుకు చెప్తోందని మరో రైతు నేత దర్శన్‌ పాల్‌ ప్రశ్నించారు. బంద్‌కు మద్దతుగా మంగళవారం అన్ని రవాణా కార్యకలాపాలను నిలిపేస్తామని ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) ప్రకటించింది.

ఏఐఎంటీసీ దేశవ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది ట్రక్కు యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో, దేశవ్యాప్తంగా నిత్యావసరాల రవాణాపై ప్రతికూల ప్రభావం పడనుంది. అతిపెద్ద రైల్వే కార్మిక విభాగాలైన ‘ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌’, ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌’ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్‌కు మద్దతుగా రైల్వే కార్మికులు నిరసన ప్రదర్శనలు చేస్తారని తెలిపాయి. కాగా, తమ కార్యకలాపాలు మంగళవారం కూడా కొనసాగుతాయని వాణిజ్యవేత్తల సంఘం సీఏఐటీ, ఆల్‌ ఇండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్పష్టం చేశాయి. బంద్‌లో నేరుగా పాల్గొనబోవటం లేదని బ్యాంక్‌ యూనియన్లు  తెలిపాయి.   బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధుల్లో పాల్గొంటారని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. విరామ సమయాల్లో బంద్‌కు మద్దతుగా బ్యాంక్‌ బ్రాంచ్‌ల ముందు ప్లకార్డులను ప్రదర్శిస్తారని తెలిపింది.

ప్రతిపక్షాల ద్వంద్వ నీతి
రైతుల ఉద్యమానికి మద్దతివ్వడం విపక్షాల ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ విమర్శించింది. సాగు చట్టాల్లోని నిబంధనలను కాంగ్రెస్, ఎన్సీపీ తదితర విపక్షాలు గతంలో మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఉన్న అన్ని ఆంక్షలను తొలగిస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు. స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు కుట్ర చేస్తున్నాయని ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతూ.. ఉనికి కోసం రైతు ఉద్యమాన్ని వాడుకుంటున్నాయని, రైతుల్లోని కొన్ని వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయన్నారు.

16 రాష్ట్రాలపై ప్రభావం
బంద్‌ వల్ల 16 రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగవచ్చని రైల్వే శాఖ పేర్కొంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచాలని సూచించింది. బంద్‌లో పాల్గొనే వామపక్ష అనుకూల అతివాదులు సమస్యలు సృష్టించే అవకాశాలున్నాయని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని జోనల్‌ మేనేజర్లకు సూచించారు.

సైకిల్‌పై 300 కి.మీ.
పంజాబ్, హరియాణాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు వెళ్లి నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ఇద్దరు యువకులు సైకిల్‌ మీద ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించారు. జోవన్‌ ప్రీత్‌ సింగ్‌ (24), గురిందర్‌ జీత్‌ (26)లు పంజాబ్‌లోని బర్నాలా నుంచి రెండు రోజుల క్రితం ప్రయాణమై సోమవారానికి ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ట్రాక్టర్లలో ప్రయాణించాలంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే సైకిళ్లపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దారిపొడవునా అప్పటికే రైతులు ఉండటంతో తిండికేమీ లోటు లేదని, రాత్రి వేళ ట్రాక్టర్లలో పడుకున్నామని చెప్పారు.

ఆ చట్టాలు మంచివే..
కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మరోసారి చెప్పారు. ఈ చట్టాలను సమర్ధిస్తున్న రైతుల బృందంతో తోమర్‌ సోమవారం సమావేశమయ్యారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, హరియాణాకు చెందిన రైతు కన్వల్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలో ఈ బృందం తోమర్‌ను కలిసింది. ఈ బృందంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌(అత్తార్‌) జాతీయ అధ్యక్షుడు అత్తార్‌ సింగ్‌ సంధూ కూడా ఉన్నారు. సాగు చట్టాలను రద్దు చేయవద్దని, అవసరమైతే కొన్ని సవరణలు చేయాలని ఈ బృందం మంత్రిని కోరింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని తమ ప్రభుత్వం ఎదుర్కోగలదని తోమర్‌ వ్యాఖ్యానించారు.  

రైతుల కోసం వైఫై..
ఢిల్లీ–హరియాణా సరిహద్దుల వద్ద ఉన్న రైతులకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ ముందుకు వచ్చింది. ఢిల్లీ సరిహద్దు వద్ద ఓ రూటర్‌ ఏర్పాటు చేశామని, అలాగే హరియాణా సరిహద్దు వద్ద పోర్టబుల్‌ డివైజ్‌ల నుంచి వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రైతులు తమ ఇంట్లో ఉన్నవారితో మాట్లాడుకుంటారని, రైతుల పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరువుతారని ఎన్జీవో సభ్యులు తెలిపారు.


అర్జున, పద్మ అవార్డులను వెనక్కు ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్‌ వైపు వెళ్తున్న మాజీ క్రీడాకారులు

రైతుల డిమాండ్లు
► ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి మూడు వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి.
► కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని వ్యవసాయ చట్టంలో చేర్చాలి.
► మండీల నుంచి కొనుగోళ్లను ప్రభుత్వమే చేపట్టాలి.
► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాల పరిష్కారానికి ప్రత్యేక వ్యవసాయ కోర్టులు నెలకొల్పాలి.

రైతుల అనుమానాలు
► సాగు రంగంలో ప్రైవేటు సంస్థల రాకతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు 15 నుంచి 20శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉంది.
► ఒకే దేశం –ఒకే మార్కెట్‌ విధానంతో భవిష్యత్‌లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అన్నదే లేకుండా పోతుంది.  
► మండీ వ్యవస్థ నిర్వీర్యమై పండిన పంటను అమ్ముకోవడం కష్టమవుతుంది.
► రైతులు, వ్యాపారుల మధ్య వివాదాలను సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ పరిధిలోనే పరిష్కరించుకోవాల్సి రావడం.  
► కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌తో భూములకు రక్షణ కరువవుతుంది.
► నిత్యావసర సరుకుల సవరణ చట్టంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది.

ప్రభుత్వం ఏమంటోంది?
► సాగు చట్టాలకు రైతు సంఘాలు కోరిన మేరకు సవరణలు చేపట్టేందుకు సిద్ధం.
► కనీస మద్దతు ధర విధానం యథా ప్రకారం కొనసాగుతుంది. దీనిపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి.  
► రాష్ట్రానికి చెందిన మండీలను ప్రభావితం చేయడం మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం.
► రైతులు అభ్యంతరం తెలుపుతున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
► కొన్ని కీలక అంశాలపై రైతు సంఘాలను సూచనలు కోరుతున్నాం.

పీటముడి ఎక్కడ?
► వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోకపోతే కనీసం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని చట్టంలో చేర్చాలని రైతులు పట్టుబడుతున్నారు. ఎంఎస్‌పీని చట్టంలో చేర్చడమంటే రైతులకు చట్టపరంగా ధరలపై హక్కు వచ్చినట్టే. ఆ డిమాండ్‌ తీర్చడం అసాధ్యమని కేంద్రం అంటోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top