నిపుణుల కమిటీలో పక్షపాతం లేదు : సుప్రీం

Farm Laws Panel Has No Power To Decide, Where Is The Bias: SC - Sakshi

 వ్యవసాయ చట్టాల నిపుణుల కమిటీకి నిర్ణయాధికారం లేదు : సుప్రీంకోర్టు

రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ, ఢిల్లీ పోలీసులదే తుది నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ : మూడు వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదంలో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి బొబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ ఏర్పాటులో రైతుసంఘాల ఆరోపణలను తోసిచ్చింది. ఈ కమిటీ ఏర్పాటులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. అలాగే సుప్రీం నియమించిన నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున పునర్నిర్మాణం కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనల​కువ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీ,  ఇతర నిరసనలకు సంబంధించిన  నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది. అఫిడవిట్​ను వెనక్కి తీసుకోవాలని  సూచించడంతో  దీన్ని కేంద్రం ఉపసంహరించుకుంది.

వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి బొబ్డే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం కోసమే కమిటీ ఏర్పాటు చేశామని, దీనికి ఎలాంటి న్యాయాధికారమూ  లేదని  స్పష్టం చేశారు.  ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులపై ముద్రలు వేయడం సరికాదు. గతంలో అభిపప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన వారిని నిందించడం తగదని సుప్రీం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉంటాయి అది ఫలితాన్ని ప్రభావితం చేయదని రైతు నేతలకు సూచించారు. ఉత్తమ న్యాయమూర్తులకు కూడా ఒకవైపు నిర్దిష్ట అభిప్రాయాలున్నా... మరొకవైపు తీర్పులు ఇచ్చారని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

కాగా సుప్రీం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై ఉద్యమకారులు, రైతు సంఘాలతో కాంగ్రెస్, అకాలీదళ్‌ సహా ఇతర ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కమిటీలోని నలుగురు సభ్యులు గతంలో వివాదాస్పద చట్టాలకు అనుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. భారతీయ కిసాన్ యూనియన్ లోక్‌శక్తి, కిసాన్ మహాపాంచాయత్ రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top