2021: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత?

Fact Check: No, Govt Employees Salaries Not Reduced From 2021 - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాదంతా ఓ శూన్య సంవత్సరంలాగే గడిచింది. విహారాలు లేవు, వినోదాలు లేవు. పెళ్లిళ్లు పేరంటాలు అంటూ తిరగడాలు అసలే లేవు. నెలల తరబడి ఇంట్లోనే బందీలై పని లేక, పొద్దు పొడవక నీరసంగా బతుకు బండిని లాగించారు. కానీ వలస బతుకులు మాత్రం కూడు దొరక్క నరకయాతన అనుభవించారు. అటు ఎందరో ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్న జాబ్‌ ఊడి రోడ్డున పడ్డారు. ఇటు ప్రభుత్వాల దగ్గర కూడా ఖజానా ఖాళీ అయి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులున్నాయి. మొత్తానికి జనాలను ముప్పు తిప్పలు పెట్టిన కరోనా పీడిత 2020 ఏడాది కథ ముగిసిపోతుంది. ఇప్పుడిప్పుడే అంతా కుదుటపడుతోంది. (చదవండి: అవార్డులు వెన‌క్కు ఇచ్చిన జ‌వాన్లు: నిజ‌మెంత‌?)

ఇలాంటి సమయంలో ఉద్యోగులను ఠారెత్తిస్తూ ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "రానున్న ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత ఉండబోతుంది. కార్మిక చట్టాల్లో సవరణల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను గ్రేడుల వారీగా విభజించి దాని ప్రకారం జీతాలు తగ్గించనున్నారు" అన్నది సదరు వార్త సారాంశం. ఇది నిజమేనని నమ్మిన నెటిజన్లు దాన్ని తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో స్పందించిన ప్రభుత్వం దీన్ని తప్పుడు వార్తగా కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) వివరణ ఇచ్చింది. 2021లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో తగ్గింపు ఉంటుందనేది పూర్తిగా అబద్ధమని పేర్కొంది. వేతన కోడ్‌ బిల్లు-2019 కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత పెడుతున్నట్లు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. కాబట్టి ఉద్యోగులు.. ఒకటో తారీఖున జీతం తక్కువ వస్తుందేమోనని ఆందోళన చెందకండి. ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మి టెన్షన్‌లు తెచ్చుకోకండి. (చదవండి: దేశ ప్రధానికి జీతం చాలట్లేదట! )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top