
సేకరించిన ఈ–వ్యర్థాల్లో 70% పునర్వినియోగం
దేశంలో ఏడాదిలో 14% పెరిగిన రీసైక్లింగ్ వాటా
2024–25లో 13,97,955 టన్నుల ఈ–వేస్ట్ నిల్వలు
ఎలక్ట్రానిక్స్ వినియోగం ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతోంది. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు ఏమీ కాదు. స్మార్ట్ ఉపకరణాలు.. ప్రధానంగా ఏఐ ఆధారిత గ్యాడ్జెట్స్ ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్ వినియోగానికి తగ్గట్టుగా ఉపకరణాల సంఖ్యా అధికం అవుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే .. గుట్టలుగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. అయితే భారత్‌లో ఈ–వేస్ట్ పునర్వినియోగం పెరుగుతుండడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2023–24లో 12,54,286 మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. 2024–25లో ఇది 13,97,955 టన్నులకు చేరింది. అంటే ఏడాదిలో ఈ–వ్యర్థాలు 11.5 శాతం పెరిగాయన్న మాట. ఈ అయిదేళ్లలో అత్యధికంగా 2022–23లో 16.09 లక్షల టన్నులు పోగయ్యాయి.
ఇక గత ఆర్థిక సంవత్సరంలో ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ వాటా మొత్తం వ్యర్థాల్లో 70.71 శాతం, 2023–24లో ఇది 61.94 శాతంగా ఉంది. రీసైక్లింగ్ వాటా ఏడాదిలో 14 శాతం అధికం కావడం సానుకూల అంశం. రాష్ట్రాల వారీగా చూస్తే రీసైక్లింగ్‌లో దేశంలో 3,88,160 మెట్రిక్ టన్నులతో ఉత్తర ప్రదేశ్ ముందుంది. ఈ–వేస్ట్ పోగవుతున్న నగరాల్లో ఢిల్లీ ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత ముంబై, హైదరాబాద్, పుణే ఉన్నాయి.
అపార అవకాశాలు..
పరిమాణం పరంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్న దేశాల్లో చైనా, యూఎస్, భారత్ తొలి మూడు స్థానాల్లో ఉంటాయి. ‘గ్లోబల్ ఈ–వేస్ట్ మానిటర్ నివేదిక 2024’ ప్రకారం.. ఈ–వేస్ట్‌లోని లోహాల ఆర్థిక విలువ సుమారు 91 బిలియన్ డాలర్లు అని అంచనా. ఈ–వేస్ట్‌ను రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అరుదైన లోహాల డిమాండ్‌లో 1 శాతం వరకు తీరుతుందట. అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిశ్రమలో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయన్నమాట.
రీసైక్లింగ్ ఒక్కటే
పరిష్కారంఅరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్స్) సరఫరాలో అగ్ర స్థానంలో ఉన్న చైనా ఎగుమతులను కట్టడి చేయడంతో.. ఈ కొరతకు పరిష్కారం కనుగొనడానికి మిగతా దేశాలన్నీ దారులు వెతుకుతున్నాయి. విదేశాల్లో అరుదైన లోహ ఖనిజ గనులను దక్కించుకోవడంతోపాటు దేశీయంగా వీటి ఉత్పత్తిని ప్రోత్సహించే పథకానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. విస్మరించడానికి వీలుకాని బంగారు నిక్షేపాలుగా ఈ–వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి.
ఎలక్ట్రానిక్స్ తయారీలో బంగారం, వెండి, రాగి వంటి విలువైన లోహాలతోపాటు స్కాండియం, సెరియం, యూరోపియం, లాంథనమ్ వంటి అరుదైన మూలకాలనూ ఉపయోగిస్తారు. ఈ–వ్యర్థాల నుంచి ఈ విలువైన లోహాలను సేకరించాలంటే సరైన రీతిలో రీసైక్లింగ్ ఒక్కటే కీలక పరిష్కారం. మైనింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఈ విధానం సాయపడుతుంది.
గృహాల నుంచే ఎక్కువభారత్‌లో పోగైన ఈ–వ్యర్థాల్లో గృహాల నుండి సేకరించినవి 70% వరకూ ఉంటున్నాయి. ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్స్ వంటివి వీటిలో ఉన్నాయి. మిగిలిన 30% వ్యాపార సంస్థల నుంచి సేకరించినవి. వీటిలో రిఫ్రిజిరేటర్లు, వాటర్ కూలర్లు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్లు, హాట్ అండ్ కోల్డ్ డిస్పెన్సర్లు, పారిశ్రామిక ప్రింటర్లు, కాపీయర్లు, వాణిజ్య వాషింగ్ మెషీన్లు, ల్యాబ్ పరికరాలు, ప్రొఫెషనల్ మెడికల్ పరికరాలు, కాఫీ మెషీన్లు, సర్వర్లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు వంటివి ఉన్నాయి.
తగ్గుతున్న బరువు
సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ పరికరాలు తేలికగా, చిన్నవిగా మారుతున్నాయి. సీఆర్‌టీ టీవీల నుండి ప్రస్తుతం సన్నని ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలకు మారడం వల్ల ఈ–వ్యర్థాల యూనిట్ బరువు గణనీయంగా తగ్గింది. అనేక ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇప్పుడు ఉక్కు, సీసం వంటి బరువైన లోహాలకు బదులుగా అల్యూమినియం, ప్లాస్టిక్‌ల వంటి తేలికైన, మరింత సమర్థవంతమైన పదార్థాలతో తయారవుతున్నాయి. ఈ మార్పు కారణంగా ఈ–వ్యర్థాల మొత్తం బరువు, పరిమాణం ప్రపంచవ్యాప్తంగా తగ్గుతోంది.

ఈ–వ్యర్థాలు..: పనికిరాని లేదా ఉపయోగించలేని ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు లేదా ఈ–వ్యర్థాలు అంటారు. కంప్యూటర్లు, మానిటర్లు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, టీవీలు, రేడియోలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ప్రింటర్లు, స్కానింగ్ చేసే పరికరాల వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. వీటిలో ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. అందువల్ల వాటిని పారేయకుండా రీసైకిల్ చేయాలి.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ–వ్యర్థాల రీసైక్లింగ్ వాటా మొత్తం వ్యర్థాల్లో 70.71 శాతం. 2023–24లో ఇది 61.94 శాతంగా ఉంది. రీసైక్లింగ్ వాటా ఏడాదిలో 14 శాతం పెరగడం సానుకూల అంశం.
