తూర్పు బిహార్ నియోజకవర్గాలపై జార్ఖండ్ నేతల ప్రభావం
అక్కడి ఐదు స్థానాల్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న వైనం
జార్ఖండ్ నేతల ప్రసన్నం కోసం ప్రధాన పక్షాల ఆసక్తి
జేఎంఎంతో ఆచితూచి ఒప్పందం
వనం దుర్గా ప్రసాద్ (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
బిహార్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది. జార్ఖండ్ రాష్టానికి చెందిన నేతలను ప్రసన్నం చేసుకుంటే తప్ప గెలుపు సాధ్యం కాదని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. బిహార్, జార్ఖండ్ సరిహద్దుల వెంట రాజ్‌మహల్ కొండలు ఉన్నాయి. ఆ కొండల వెంట ఉండే కతియార్, భాగల్పూర్‌లోని కహాల్‌గావ్, బంకా, జముయ్ జిల్లాల్లోని ఎక్కువ భాగం ప్రజలు సంస్కృతి, భాష పరంగా జార్ఖండ్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో రాజకీయంగా తూర్పు బిహార్‌పై జార్ఖండ్ నేతల ప్రభావం ఉంటుందని స్వయంగా స్థానిక ఓటర్లే చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం ఐదు నియోజకవర్గాల్లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఈ ప్రాంతంలోని గిరిజనుల ఓట్లే నేతల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి.
జార్ఖండ్ కేంద్రంగా వ్యూహ రచన
చకై, బంకాలోని బెల్హార్, కటారియా కతిహార్‌లోని మణిపురి, భాగల్‌పూర్‌లోని కహాల్‌గావ్ అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు ఎక్కువ. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) గతంలో చకయి స్థానం నుంచి పోటీ చేసి గెలిచింది. ఈ ప్రాంత వాసులు గత ఏడాది నవంబర్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
జముయి జిల్లా ఖైరా బ్లాక్‌లోని గిరిజన ఫ్రైడే వేడుకకు రెండు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్‌డీఏ నేతలు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. విపక్షాల ‘ఇండియా’ కూటమి సైతం ఈ విషయాన్ని ముందే పసిగట్టింది. జార్ఖండ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు తెగ ప్రయతి్నస్తోంది. ఓట్లను రాబట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఇరు కూటములు కుల సమీకరణలను బేరీజు వేసుకుంటున్నాయి.
చకయి చేజిక్కాలంటే..
జముయి జిల్లాలోని చకయి అసెంబ్లీ నియోజకవర్గం జార్ఖండ్‌లోని దేవరి సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ఓటర్లలో 20.8 శాతం మంది యాదవులు, 11.5 శాతం మంది ముస్లింలు, 8.4 శాతం మంది గిరిజనులు ఉన్నారు. వీళ్లే అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. జేఎంఎం, జేడీయూ ఎన్నికల చిహ్నాలు దాదాపు ఒకే ఆకృతిలో ఉండటం జేడీయూ బాగా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు. అందుకే ఓట్లు జేడీయూకు పడుతున్నాయనే ఫిర్యాదులు గతంలోనే వెల్లువెత్తాయి. 2010లో జేఎంఎం టికెట్‌పై సుమిత్ సింగ్ 188 ఓట్ల తేడా గెలిచారు. 2020లో అతనే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి ఆర్జేడీ అభ్యరి్థని 581 ఓట్లతో ఓడించారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు.
బెల్హార్ బలాబలాలు కీలకమే
జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ సమీపంలోని బెల్హార్ సైతం జార్ఖండ్ మూలాలున్న నేతలతో ఇరు కూటములకు సవాల్‌గా మారింది. 2015 ఎన్నికల్లో కటోరియాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కిషోర్ ప్రసాద్ జేఎంఎం టికెట్‌పై పోటీ చేశారు. 2010 సురేంద్ర ప్రసాద్ గుప్తా జేఎంఎం నుంచి పోటీచేసి 11 వేల ఓట్లు సాధించారు. 2005 ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్థి శైలేంద్ర కుమార్ 3 వేల ఓట్లు సాధించారు. మొదట్నుంచీ ఇక్కడ జార్ఖండ్ మూలాలున్న నేతలు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో ఎన్‌డీఏ, విపక్షాల ‘ఇండియా’ కూటమి జేఎంఎం నేతల ప్రసన్నం కోసం అనేక వ్యూహాలు అనుసరిస్తున్నాయి. 2020లో ఇక్కడ జేడీయూకు చెందిన మనోజ్ యాదవ్ సమీప అభ్యర్థి ఆర్జేడీ నాయకుడు రామ్‌దేవ్ యాదవ్‌పై కేవలం రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆర్జేడీ హవా కొనసాగితే అధికార కూటమికి ఇక్కడ పరాభవం తప్పదు
కహల్గావ్ కహానీ
జార్ఖండ్‌లోని గొడ్డా ప్రాంతానికి అనుకుని ఉన్న కహల్గావ్ సీటు ఇక్కడ కీలకమైంది. ఈ స్థానం నుంచి తన కుమారుడిని అభ్యర్థిగా నిలపాలని జార్ఖండ్ మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారు. గొడ్డా ఎమ్మెల్యే సంజయ్ జార్ఖండ్‌లో ఆర్జేడీ కోటా నుంచి మంత్రిగా ఉన్నారు. జార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు దీపికా పాండేసింగ్ సైతం తన సన్నిహితురాలు ప్రవీణ్ కుషా్వహాను ఈ స్థానం నుంచి పోటీకి నిలపాలని ప్రయతి్నంచారు. వీళ్లను ప్రసన్నం చేసుకుని తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ గతంలోనే ప్రయతి్నంచారు. కహల్గావ్‌లోని గోరాదిహ్‌లో ఇటీవల సమావేశం నిర్వహించారు. అయితే అందరినీ కలుపుకొనిపోవడం ఆయనకు తలనొప్పిగానే మారింది. ఎన్‌డీఏ ఇక్కడ సమీకరణలపై ముమ్మర కసరత్తు చేస్తోంది.
కటోరియాను ఆకట్టుకునేదెలా?
కటోరియా స్థానంపై గత 35 సంవత్సరాలుగా జేఎంఎం పార్టీ కన్నేసింది. 2015, 2020లో జేఎంఎం బంకా జిల్లాలోని కటోరియా స్థానం నుంచి అంజలి హన్నాను నిలబెట్టింది. షెడ్యూల్డ్ కులాలకు కేటాయించిన రెండు సీట్లలో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ఏ పార్టీ తరఫున పోటీచేసినా సరే ఆ అభ్యరి్థకి జార్ఖండ్ నేతల ఆశీస్సులు కీలకం. ముఖ్యంగా జేఎంఎం మద్దతు అత్యంత ముఖ్యం. అనుకూలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పార్టీలు విజయావకాశాలకు పావులు కదుపుతున్నాయి.
‘మణి’హారం ఎవరిదో?
ఎస్టీలకు కేటాయించిన కతిహార్‌లోని మణిహరి సీటును కైవసం చేసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. గిరిజన ఓటు తమకు అనుకూలమని చెబుతోంది. గత ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. దీంతో పార్టీల గెలుపు అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి ఈ ఇబ్బంది రాకుండా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు జార్ఖండ్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సంప్రదింపులు జరిపారు. చివరకు జేఎంఎం చించిన నేతలనే అన్ని పార్టీలూ బరిలోకి దించాయి. అయితే ఇక్కడ పడకేసిన అభివృద్ధి అనేదే ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే వీలుంది.


