ఆరోగ్యం, ఆర్థికాంశాలపై పెరుగుతున్న అవగాహన
48కి ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోర్
యాక్సిస్ మ్యాక్స్ – కాంటార్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైర్మెంట్ సన్నద్ధతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్కోరు 2022లో 44గా ఉండగా 2025లో 48కి పెరగడం దీనికి నిదర్శనం. భారతీయుల్లో ఆరోగ్యం, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణంగా నిలుస్తోంది. డేటా అనలిటిక్స్ కంపెనీ కాంటార్‌తో కలిసి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని సగం మంది ప్రజలు రిటైర్మెంట్ ప్లానింగ్‌ను సాధ్యమైనంత ముందుగా, 35 ఏళ్ల లోపు నుంచే ప్రారంభించాలని విశ్వసిస్తున్నారు.
ఇందుకోసం ఫిట్‌నెస్ అలవాట్లను పెంపొందించుకోవడం, తరచుగా హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. సర్వే ప్రకారం ఆరోగ్య బీమాను తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే, సరిపోయేంత స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉండే విషయంలోనే సవాళ్లు ఉంటున్నాయి. తాము దాచుకున్న సొమ్ము రిటైర్మెంట్ తర్వాత పదేళ్ల లోపే అయిపోవచ్చేమోనని 63 శాతం మంది భావిస్తున్నారు. 37 శాతం మంది మాత్రమే రిటైర్మెంట్ పొదుపు లక్ష్యాల్లో కనీసం 25 శాతాన్ని సాధించారు.
ముందు వరుసలో మహిళలు..
రిటైర్మెంట్ సన్నద్ధతలో మహిళలు, గిగ్ వర్కర్లు ముందువరుసలో ఉంటున్నారు. అయితే, ఒంటరితనం, కుటుంబంపై ఆర్థికంగా ఆధారపడాల్సి రావడంలాంటి విషయాల్లో ప్రజల్లో ఆందోళన ఉంటోంది. ఈ అంశాలపై వరుసగా 71 శాతం, 72 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా చూస్తే పూర్తి స్థాయి సన్నద్ధతలో తూర్పు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండగా, కోవిడ్ తర్వాత ఆరోగ్యపరమైన రికవరీలో ఉత్తరాది మెరుగ్గా ఉంది. ఆర్థిక విషయాల్లో పశి్చమ రాష్ట్రాలు పటిష్టంగా ఉన్నాయి. అవగాహన పెరుగుతున్నప్పటికీ, సన్నద్ధత విషయంలో మాత్రం వెనుకబాటుతనం ఉంటోందని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్లు, మహిళలు, తిరిగి వచ్చిన వలసదార్లలాంటి వివిధ వర్గాల కోసం తగిన విధమైన రిటైర్మెంట్ సొల్యూషన్స్, సలహా సేవలు అవసరమని సర్వే పేర్కొంది.


