బిహార్ ఎన్నికల్లో అత్యంత కీలక వ్యక్తిగా ‘మల్లా కుమారుడు’ ముఖేశ్ సహానీ
15 సీట్లలోనే పోటీలో నిలిచినప్పటికీ ఇండియా కూటమి నుంచి అతనే ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి
మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఆయన వర్గమే కీలకం
నితీశ్‌ను దించే వరకు వదలనంటూ ప్రచార రంగంలోకి
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
బిహార్ రాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విపక్షాల ‘ఇండియా’ కూటమిలో చర్చల తర్వాత ఒక చిన్న పార్టీకి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్న నిర్ణయం యావత్ దేశాన్ని అతని వైపు చూసేలా చేసింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు ‘ఇండియా’ కూటమిలో ఉన్నప్పటికీ 44 ఏళ్ల యువనేతను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
మునుపటి ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాల్లో గెలిచి ప్రస్తుతం 15 సీట్లలో మాత్రమే పోటీపడుతున్న పార్టీ నేత ఇప్పుడు ‘ఇండియా’ కూటమి ప్రచార కార్యాక్రమాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేశ్ సహానీ. మల్లా (మత్య్సకార) వర్గానికి చెందిన సహానీ ప్రస్తుతం మిథిలాంచల్, సీమాంచల్ సహా అనేక ప్రాంతాల్లో ఎన్‌డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
‘మల్లా’లే అత్యంత కీలకం..
బిహార్‌లో మల్లా వర్గం వాళ్లు ప్రధానంగా పడవ నడిపడం, చేపలు పట్టడం వృత్తిలో కొనసాగుతారు. వీరినే నిషాద్, కేవత్ అని కూడా పిలుస్తారు. మిథిలాంచల్, సీమాంచల్, ముజఫర్‌పూర్, దర్భంగా, సుపాల్, వైశాలి, సీతామర్హి, షెయోహర్, కిషన్‌గంజ్, సహర్సా, ఖగారియా, తూర్పు చంపారన్, పశి్చమ చంపారన్ జిల్లాల్లో ఈ వర్గం మత్స్యకారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. జనాభాలో వీరు ఐదారు శాతం దాకా ఉంటారు.
అత్యత వెనుకబడిన కులాల (ఈబీసీ) సమూహంలో వీరు అతి ముఖ్యమైన ఓటు బ్యాంక్‌గా ఎదిగారు. ముజఫర్‌పూర్ వంటి కొన్ని జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ వర్గం నేతలే ఎంపీలుగా గెలుస్తున్నారు. కీలక నేత జై నారాయణ్ ప్రసాద్ సైతం ఈ వర్గంవారు. ఆయన తర్వాత ఆ స్థాయిలో పేరు, పలుకుబడి సాధించింది ముఖేశ్ సహానీ మాత్రమే. సహానీ తనను తాను ‘మల్లా కుమారుడు’గా ప్రకటించుకొని ఈ వర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు.
సేల్స్‌మ్యాన్ నుంచి నుంచి డిప్యూటీ సీఎం అభ్యర్థి దాకా..
1981లో దర్భంగా>లో ఒక మత్స్యకారుల కుటుంబంలో ముఖేష్ సహానీ జన్మించారు. ‘సన్ ఆఫ్ మల్లా’ అనే పేరుతో కొత్త క్రేజ్ సంపాదించుకున్నారు. 19 ఏళ్ల వయసులో బిహార్‌ను విడిచిపెట్టి, ముంబైలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశాడు. అనంతరం బాలీవుడ్‌లోకి సెట్ డిజైనర్‌గా అడుగుపెట్టాడు. షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్, సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు .
ముంబైలో ముఖేష్ సినీ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడిపాడు. 2013లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, బిహార్æ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న, దివంగత కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల నుండి ప్రేరణ పొందారు. బిహార్ జనాభాలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ ఉన్న అత్యంత వెనుకబడిన తరగతుల (ఈబీసీ) కోసం పోరాడటానికి సహానీ తిరిగి స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు.
రాజకీయ కారణాలతో బీజేపీని వదిలి 2015లో నిషాద్ వికాస్ సంఘ్‌ను స్థాపించారు. ఇదే తర్వాత 2018లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీగా రూపాంతరం చెందింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖేశ్ సమానీ నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు మద్దతు ఇచ్చాడు. కానీ తర్వాత అతనితో విడిపోయాడు. మల్లా సమాజానికి రిజర్వేషన్లు, సౌకర్యాలు ఇస్తానని హామీ ఇచ్చి తర్వాత మోసం చేశారని ఆరోపణలు గుప్పిస్తూ నితీశ్ నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
కొంత కాలానికి మళ్లీ ఎన్‌డీఏలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేసి 4 సీట్లలో గెలిచారు. స్వయంగా సహానీ ఓటమిని చవిచూసినప్పటికీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఒక ఏడాది తర్వాత ఆయన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా, మరో ముగ్గురు బీజేపీలో చేరారు. తర్వాత ఈయన 2024లో ఇండియా కూటమిలో చేరారు. కూటమిలో తనకు 40 స్థానాలు ఇవ్వాలని కోరినప్పటికీ అది సాధ్యపడకపోవడంతో 15 సీట్లు కేటాయించింది. అయితే ఆయన వర్గానికి ఉన్న ప్రాధాన్యత దష్ట్యా ఆయన్ను ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది.
50–60 నియోజకవర్గాలపై ప్రభావం
ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన అనంతరం సహానీ తన దూకుడు పెంచారు. తనను రాజకీయంగా అణచివేసిన నితీశ్ కుమార్, బీజేపీలే లక్ష్యంగా ఆయన ప్రచారం సాగుతోంది. కేవలం 15 సీట్లలో పోటీ చేస్తున్న ఒక పార్టీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవిని ‘ఆఫర్’చేయడం వెనుక ‘ఇండియా’ కూటమి పక్కా వ్యూహం కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆర్జేడీకి సంప్రదాయబద్ధంగా ఉన్న ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంక్ (సుమారు 31 శాతం)కు అదనంగా, నితీశ్ కుమార్‌కు వెన్నెముకగా ఉన్న ఈబీసీ (అత్యంత వెనుకబడిన తరగతులు) ఓటు బ్యాంకును చీల్చడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం.
రాష్ట్ర జనాభాలో 36% ఉన్న ఈబీసీలలో, 5–6% ఉన్న నిషాద్ వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ద్వారా, ఈబీసీలందరికీ ‘ఇండియా’ కూటమి బలమైన సందేశం పంపింది. సహానీ పోటీ చేస్తున్న 15 స్థానాల కంటే, ఆయన తన సామాజిక వర్గం బలంగా ఉన్న మిథిలాంచల్, సీమాంచల్, చంపారన్ ప్రాంతాల్లోని సుమారు 50–60 నియోజకవర్గాలపై చూపే ప్రభావమే కీలకం. ఆయన తన నిషాద్ ఓట్లను ‘ఇండియా’ కూటమి అభ్యర్థులకు బదిలీ చేయగలిగితే, అది ఎన్డీఏ, ముఖ్యంగా జేడీ(యూ) కోటను బద్దలు కొట్టగలదు. అందుకే ‘వీఐపీ’నేతగా ఉన్న సహానీ, ఇప్పుడు బిహార్ ఎన్నికల రాజకీయాల్లో ‘వీవీఐపీ’గా మారి, మొత్తం ఫలితాన్నే శాసించే కీలక నేతగా ఆవిర్భవించారు.


