పారాచూట్‌ నేతలతో పరేషాన్‌..! | Trouble starts with Parachute Candidates in Bihar Polls | Sakshi
Sakshi News home page

పారాచూట్‌ నేతలతో పరేషాన్‌..!

Nov 2 2025 5:32 AM | Updated on Nov 2 2025 7:41 AM

Trouble starts with Parachute Candidates in Bihar Polls

టిక్కెట్‌ ఆశించి భంగపడిన వారికి అసంతృప్తి

దక్కించుకున్న వారిలో సమన్వయ లోపం

మారిన సీట్లలో మారుతున్న పొలిటికల్‌ సీన్‌

వ్యూహమంటున్నా పార్టీలను వీడని ఆందోళన

వనం దుర్గాప్రసాద్‌ (బిహార్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

పారాచూట్‌ నేతలు ఏమేరకు విజయా న్ని అందిస్తారనేది బిహార్‌లోని అన్ని పార్టీల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపు అన్ని పార్టీల నేతలూ దీన్నో సమస్యగానే భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా అకస్మాత్తుగా పార్టీలో చేరిన వారికి(పారాచూట్‌ నేతలకు), టిక్కెట్‌ ఇచ్చి బరిలో దించడం చకచకా చేసేశాయి. 

దీంతో ఆ పార్టీలు జనంలోకి వెళ్లలేక, అప్పటి వరకూ జనంలోనే ఉన్న అసంతృప్తి నేతలకు సమాధానం ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితులు విజ యావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతా యని విశ్లేషకులు అంటున్నారు. బిహార్‌ పీఠం చేజిక్కించుకోవడానికి ప్రతీ నియో జకవర్గమూ కీలకంగా మారింది. అందుకే ప్రతీ సీటుపైనా పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టిక్కెట్‌ చేజిక్కించుకున్న స్థానాల్లో విజయం సాధించాలంటే ప్రత్యేక వ్యూహ రచన తప్పదని భావిస్తున్నాయి.

ఎవరిపై ‘జాలి’?
దర్భంగా జిల్లా జాలి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రిషి మిశ్రా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆయన తాత లలిత్‌ నారాయణ్‌ మిశ్రా రాజకీయ వారసత్వం టిక్కెట్‌ విషయంలో మలుపు తప్పింది. దీంతో తాజాగా పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఆర్‌జేడీ అభ్యర్థి జబీర్‌ అన్సారీ ఇక్కడ ఎమ్మెల్యే. ముస్లిం, యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో అభ్యర్థి మార్పు కారణంగా ఓటు బదలాయింపు ఏమేర ఉంటుందనేది కాంగ్రెస్‌ వర్గాల్లోనూ సందేహంగానే ఉంది. 

అలీనగర్‌లో అల్లుకుపోతారా?
గాయకుడు మైథిలీ ఠాకూర్‌ను బీజేపీ అలీనగర్‌ నుంచి పోటీకి దింపింది. ఇది బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈసారి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఇంతకాలం కేడర్‌లో ఉంది. బ్రాహ్మణ ఓటర్లు ఎన్‌డీయే పక్షం వైపు ఉన్నారనే విశ్వాసమే దీనికి కారణం. వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి చెందిన మిశ్రీలాల్‌ యాదవ్‌ 2020లో కేవలం 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈయన ఎన్‌డీయే అభ్యర్థి అయినప్పటికీ ఈసారి బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఓట్లు చీలిపోతే కష్టమని, కొత్త అభ్యర్థి గెలుపు జాతీయ నాయకుల ప్రచారంపై ఆధారపడి ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఆఖరి నిమిషంలో ఈ ప్రయోగం సరికాదనే వాదన ఆ పార్టీ నుంచి విన్పిస్తోంది.

‘ఔరా’అన్పించేదెవరు?
ముజఫర్‌పూర్‌ జిల్లా ఔరై నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ప్రాంతం. బీజేపీ అభ్యర్థి రామ్‌ సూరత్‌ కుమార్‌ ఇక్కడ ఎమ్మెల్యే. 47 వేల ఓట్ల మెజారిటీతో గతంలో గెలిచారు. ఇప్పుడీ స్థానాన్ని రమా నిషాద్‌కు కేటాయించింది పార్టీ. ఇప్పటి వరకూ ఆమె పార్టీలో కూడా లేరు. ఇంకా చెప్పాలంటే రాజకీయాలకూ ఆమె దూరంగానే ఉన్నారు. కేవలం ఇంటి పనులు మాత్రమే చేసుకుంటున్నారు. పార్టీలో చేరడం, టిక్కెట్‌ ఇవ్వడం అన్నీ నాలుగు రోజుల్లోనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆమె ఎలా ప్రభావితం చేస్తారన్నది ప్రశ్నగానే మిగిలిపోయిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ఆకట్టుకునేదెలా?
పైన పేర్కొన్న చోట్లనే కాదు.. అనేక సీట్లలో ఇదే ప్రయోగం. దీన్ని మార్పు అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. స్థానిక అంశాలపై ప్రస్తుత అభ్యర్థిని ప్రజల అసంతృప్తికి దూరం చేయడమే వ్యూహమంటున్నాయి. టిక్కెట్‌ ఇవ్వడానికి ముందు జేడీయూలో ఉన్న కౌశల్‌ యాదవ్, పూర్తిమ యాదవ్‌ను నవాడ, గోవింద్‌పూర్‌ స్థానాలకు ఎంపిక చేయడం వ్యూహమేనని ఆర్‌జేడీ తెలిపింది. యాదవ్‌ ఓట్లకు గాలం వేయడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. 

శివహార్‌ నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా ఉన్న చేతన్‌ ఆనంద్‌ను జేడీయూ నైన్బీనగర్‌ నుంచి బరిలోకి దింపింది. రాజ్‌పుత్‌లను ఆకర్షించడానికి జేడీయూ కోమల్‌ సింగ్‌ను నామినేట్‌ చేసింది, ఆయన తల్లి వీణా దేవి ఎల్‌జేపీ ఎంపీ. బీజేపీకి చెందిన అజయ్‌ కుష్వాహా జేడీయూ కండువా కప్పుకున్న వెంటనే ఆ పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇచ్చింది. ఎల్జేపీ సీటు సాధించడంలో విఫలమైన సరితా పాశ్వాన్‌ జేడీయూలో చేరారు. దీంతో, ఆమె ఆ పార్టీ అభ్యర్థి అయిపోయారు. ఇలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు అన్ని పార్టీల్లో ఉన్నా విజయావకాశాలపై అనుమానాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.

వనం దుర్గాప్రసాద్‌ (బిహార్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement