పట్టణాల్లో 60 శాతం మహిళలు ఈ రంగంలోనే
విద్య, ఆరోగ్యం, రిటైల్‌లలో అతివలే అధికం
ప్రపంచంలో సేవా రంగంలో ఉన్నవారు 50 శాతం
మనదేశంలో ఉన్నది మాత్రం కేవలం 31 శాతమే
దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో 30 శాతం సేవా రంగంలో పనిచేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో.. నిర్మాణ, తయారీ వంటి రంగాలతో పోలిస్తే సేవా రంగంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో.. సేవా రంగంలో ఉన్న మహిళల శాతం కేవలం 10.5 శాతం కాగా.. పట్టణాల్లో ఏకంగా 60 శాతం కావడం విశేషం. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం గత ఆరేళ్ల కాలంలోనే ఈ రంగంలో 40 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి.
ఆ రంగాల్లో స్త్రీలు అధికం
మొత్తం ఉద్యోగుల్లో.. పట్టణాల్లో ఉన్నవారిలో 60.8 శాతం సేవా రంగంలో ఉంటే, గ్రామాల్లో ఇది కేవలం 18.9 శాతం. మొత్తం సేవా రంగంలోని ఉద్యోగుల్లో పురుషులు 34.9 శాతం కాగా, స్త్రీలు 20.1 శాతం.
» విద్య, ఆరోగ్యం, రిటైల్ రంగాల్లో మహిళల వాటా ఎక్కువగా ఉంది.
» మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 74 శాతం.. 30–44 ఏళ్ల లోపు వారే కావడం విశేషం.
» మొత్తం సంఖ్యలో దాదాపు 38 శాతం పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారే.
2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో/కార్మికుల్లో సేవారంగంలో 50 శాతం ఉంటే.. మనదేశంలో 31 శాతం ఉన్నారు. దేశంలో 2023–24 నాటికి జనాభాలో సేవా రంగంలో ఉన్నది 18.8 కోట్ల మంది.
తెలుగు రాష్ట్రాలు
మొత్తం ఉద్యోగుల్లో.. సేవా రంగంలో పనిచేసేవారు అత్యధికంగా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. అక్కడ 48.5 శాతం మంది ఇందులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 31.8 శాతం కాగా, తెలంగాణలో 34.8 శాతం. సేవా రంగంలోని ఉప విభాగాల్లో.. 2023–24లో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉన్నాయి.
» సమాచారం, కమ్యూనికేషన్లు; ఆతిథ్యం, ఆహారం; రవాణా, నిల్వ; రియల్ ఎస్టేట్; ఆర్థికం, బీమా; కళలు, వినోదం; ఆరోగ్యం, సామాజిక సేవ; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగం; ఇతర సేవలు వంటి విభాగాల్లో ఏపీ టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో ఉంది.
» సమాచారం, కమ్యూనికేషన్లు; రవాణా, నిల్వ; రియల్ ఎస్టేట్; ఆర్థికం, బీమా; పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ రంగం; ఇతర సేవలు, కుటుంబ కార్యకలాపాలు వంటి విభాగాల్లో తెలంగాణ టాప్–10 రాష్ట్రాల జాబితాలో ఉంది.
సామాజిక భద్రత ప్రధానం
ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నీతి ఆయో గ్ కొన్ని సూచనలు చేసింది. స్వయం ఉపాధి పొందుతున్నవారు, గిగ్, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని పేర్కొంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలు పెంచే కార్యక్రమాలు చేపట్టాలని, డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింత విస్తరించాలని తెలిపింది. మహిళల ప్రాతినిధ్యం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది.
-సాక్షి, స్పెషల్ డెస్క్


