164 స్థానాల్లో డీఎంకే పోటీ | DMK to contest in 164 out of 234 seats in Tamil Nadu: MK Stalin | Sakshi
Sakshi News home page

164 స్థానాల్లో డీఎంకే పోటీ

Mar 29 2026 6:00 AM | Updated on Mar 29 2026 6:00 AM

DMK to contest in 164 out of 234 seats in Tamil Nadu: MK Stalin

మిత్రపక్షం కాంగ్రెస్‌కు 28 సీట్లు

మొత్తంగా 11 కూటమి పార్టీలకు 70 సీట్లు

ఎట్టకేలకు కుదిరిన సీట్ల ఒప్పందం

పాత స్థానాల నుంచే స్టాలిన్, ఉదయనిధి పోటీ

చెన్నై: తమిళనాట అధికార డీఎంకే పార్టీ వచ్చే నెలలో జరగబోయే శాసనసభ ఎన్ని కల్లో 164 స్థానాల నుంచి బరిలో దిగనుంది. తన సారథ్యంలోని లౌకిక ప్రగతిశీల కూటమి(ఎస్‌పీఏ)లో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, డీఎండీకే తది తర 11 పార్టీలకు డీఎంకే మొత్తంగా 70 సీట్లను కేటాయించింది. కూటమి పార్టీల్లో కాంగ్రెస్‌కు అత్యధికంగా 28 సీట్లు కేటాయించింది. ఈ సందర్భంగా శనివారం చెన్నైలోని పార్టీ కార్యాల యంలో డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. నిదానంగా చర్చలు జరపడంతో నష్టంకంటే లాభమే ఒనగూరింది. మిత్ర పక్షాలన్నింటినీ సంతృప్తిపరుస్తూ సీట్లు కేటాయించాం.

ఎస్పీఏ కూటమిలో ఐక్యతకు ఇది నిదర్శనం. ఎన్నికల తర్వాత డీఎంకే 2.0 ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అభ్యర్థులంతా గెలుపు గుర్రాలే’’ అని అన్నారు. పార్టీ మేనిఫెస్టోను ఆదివారం విడుదలచేస్తానని ఆయన వెల్లడించారు. వైకో సారథ్యంలోని ఎండీఎంకేలోని కొందరు అభ్యర్థులు సహా 11 మంది కూటమి పార్టీల అభ్యర్థులు ఈసారి డీఎంకే ‘ఉదయించే సూర్యుడు’ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతుండటం విశేషం. దీంతో డీఎంకే పరోక్షంగా 175 స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నట్లయింది. సీట్ల సర్దుబాటు తర్వాత పొన్నేరి, ఈరోడ్‌ ఈస్ట్, విలవన్‌కోడె, శివకాశి, కరైకుడి సహా 28 స్థానాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీకి నిలబడుతున్నారు. కూటమి న్యాయం పాటిస్తూ... దివంగత తమిళనటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ స్థాపించిన డీఎండీకే పార్టీకి 10 సీట్లు కేటాయించారు.

దాదాపు మంత్రులందరికీ మళ్లీ చాన్స్‌
33 మంది కేబినెట్‌ మంత్రుల్లో ము గ్గురు మినహా మిగతా వారందరికీ సీఎం స్టాలిన్‌ మళ్లీ పోటీచేసే అవకాశం కల్పించారు. కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేలకూ మరోసారి పోటీచేసే అవకాశం దక్కింది. ఈసారి వైద్యులు, ఇంజనీర్లు, పీహెచ్‌డీ పట్టాదారులు సహా 60 మందికిపైగా కొత్తవాళ్లను డీఎంకే రంగంలోకి దింపుతోంది. డీఎంకే పార్టీ తరఫున ఈసారి 18 మంది మహిళా నేతలూ ఎన్నికల రణక్షేత్రంలోకి దూసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నాలుగోసారి కొలథూర్‌ స్థానం నుంచి పోటీచేయనున్నారు. ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి మరోసారి చెపాక్‌–త్రిప్లికేన్‌ నుంచి పోటీచేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement